ఆదివాసీ మహిళను వంచించిన హోంగార్డు

12 Aug, 2019 08:44 IST|Sakshi
శిశువును అధికారులకు అప్పజెబుతున్న కుటుంబీకులు

మాయమాటలతో సహజీనం

నిండుగర్భిణిని ఆసుపత్రిలో వదిలి పరారు

మగబిడ్డకు జన్మనిచ్చి మరణించిన మహిళ

సాక్షి. ఆసిఫాబాద్‌ : కుమురం భీం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహితుడైన ఒక హోంగార్డు అవివాహితను పెళ్లి చేసుకుంటానని మోసగించి గర్భవతిని చేసి ఆమె మరణానికి కారణమైన సంఘటన కుమురం భీం జిల్లాలో ఆదివారం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్‌ మండలంలోని దంపూర్‌ గ్రామానికి చెందిన దుర్వా అరుణ (28) అనే గిరిజన మహిళను ఆసిఫాబాద్‌ ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న నార్నూర్‌ మండలం ఉమ్రి గ్రామంలోని లచ్చిరాం కుమారుడైన జాదవ్‌ సజన్‌ లాల్‌ ప్రేమ పేరుతో వివాహం చేసుకుంటానని మాయ మాటాలు చెప్పి నమ్మించాడు.

అతనికి పెళ్లి జరిగిన విషయం, కుమారుడు ఉన్న విషయాన్ని అరుణ దగ్గర చెప్పకుండా పెళ్లి కాక ముందే గర్భవతిని చేశాడు. ఎంత కాలం గడిచిన సజన్‌ లాల్‌ ఆమెను వివాహం చేసుకోకపోవడంతో బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు అధికారులు అతన్ని పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించగా అరుణను పెళ్లి చేసుకుంటానని, డెలివరీ ఖర్చులు సైతం తానే భరిస్తానని ఒప్పుకున్నాడు.

ఇదీ జరిగింది..
ఈ నెల 4వ తేదిన బాధిత మహిళకు పురిటి నొప్పులు రాగా ఆమెను ఆసిఫాబాద్‌ ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ ఆసిఫాబాద్‌ వైద్యులు మంచిర్యాల ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. యువతి పరిస్థితి ఉందోళనకరంగా ఉందని హైదరాబాద్‌ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ సజల్‌ లాల్‌ ఆమెను ఆసిఫాబాద్‌ తీసుకుని వచ్చి ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు. బాధిత కుటుంబీకులు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా ఆసిఫాబాద్‌ వైద్యులు, డీఎస్పీ సహాయంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు అరుణను తరలించారు. అక్కడే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు కడుపులో మంటలు రావడంతో హైదారాబాద్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కాని కొద్ది సేపటికే ఆమె మరణించింది. పోలీసులు మృతదేహాన్ని ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఇది తెలుసుకున్న యువతి బంధువులు ఆస్పత్రికి చేరుకుని హోంగార్డును కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

పోలీసులు సహకరించడం లేదని  బాధితురాలి బంధువుల ఆవేదన..
గత తొమ్మిది నెలల నుంచి తమకు న్యాయం చేయాలని గతంలో పని చేసిన సీఐని కలిసినట్లు బాధితురాలి తండ్రి నాందేవ్, సోదరీమణులు మాత శ్రీ, సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మోసం చేసిన వ్యక్తి పోలీస్‌ శాఖకు చెందిన వాడు కావడంతో తమకు పోలీసులు సహకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పకోవాలో తెలియక అరుణను కోల్పోవాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరయ్యారు.

ఎమెల్యే హామీతో ఆందోళన విరమణ..
సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీఎస్పీ సత్యనారాయణ, ఎంపీపీ మల్లికార్జున్‌ ఆస్పత్రికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనకు కారణమైన హోంగార్డుపై చర్యలు తీసుకుంటామని తెలపడంతో ఆందోళన విరమించారు.

శిశు సంరక్షణ కేంద్రానికి చేరిన శిశువు..
హోంగార్డు మోసానికి బలైపోయిన యువతి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి మరణించడంతో ఆ శిశువును జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి సావిత్రికి అప్పగించారు. ఆమె శిశువును ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆదివాసీ మహిళకు జరిగిన అన్యాయానికి కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలికి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఇలాంటి ఘటన జరగడం బాధకరమని వాపోతున్నారు.

మరిన్ని వార్తలు