సిటీకి హనీట్రాప్‌ లింక్‌?

1 Oct, 2019 07:35 IST|Sakshi
భోపాల్‌ పోలీసుల అదుపులో హనీ ట్రాప్‌ నిందితురాలు

 భోపాల్‌ టు బెంగళూరు!  

ఇక్కడి నుంచే ప్రధాన సూత్రధారి నిఘా  

వీఐపీల ఫోన్‌ డేటా ఆమె గుప్పిట్లో  

కర్ణాటక, బనశంకరి: మధ్యప్రదేశ్‌లో గుట్టురట్టయిన బృహత్‌ హనీ ట్రాప్‌ కేసుకు బెంగళూరుతోనూ లింకులు ఉన్నట్లు బయటపడింది. భోపాల్‌లో ఒక మహిళ యువతులను ఉన్నతాధికారులు, నాయకులు తదితరవీఐపీల వద్దకు పంపి వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం, భారీఎత్తున నగదు, స్థిరాస్తులను సంపాదించిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండడం తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద హనీ ట్రాప్‌గా భావిస్తున్న కేసులో మధ్యప్రదేశ్‌లో పోలీసులకు పట్టుబడిన సూత్రధారి శ్వేతా విజయ్‌జైన్‌ బెంగళూరులో ప్రైవేటుగా నిఘా వహించే కంపెనీలో విధులు నిర్వహిస్తున్నట్లు భోపాల్‌ పోలీసుల విచారణలో తేలింది. బెంగళూరు నగరానికి చెందిన సంతోష్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్న సైబర్‌ భద్రత కంపెనీలో ఆమె పనిచేసేవారు. ఇక్కడి నుంచే మధ్యప్రదేశ్‌లో తన వలలో చిక్కుకున్న అధికారులు, నాయకుల ఫోన్‌ కాల్స్, చాటింగ్, ఎస్‌ఎంఎస్‌లపై నిఘా వహిస్తున్నట్లు పోలీసుల తనికీలో తెలిసింది. హనీ ట్రాప్‌ కేసులో శ్వేతా తో కలిసి సంతోష్‌ బృందం భాగస్వామిగా ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం.

ఆధునిక సాఫ్ట్‌వేర్లతో పర్యవేక్షణ
శ్వేత ఈ కంపెనీ తరఫున పలు కేంద్ర సంస్థల్లో పనిచేసినట్లు తెలిసింది. బ్లాక్‌ మెయిలింగ్‌ చేస్తూ అధికారులు, రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలను ట్రాప్‌లోకి దింపడం మాత్రమే కాకుండా వారిపై నిఘా పెట్టేవారు. అనుమానాస్పదం అనిపిస్తే హెచ్చరికలు జారీచేసేవారు. ఫోన్ల పర్యవేక్షణకు పలు ఆధునిక సాఫ్ట్‌వేర్లను, ఉపకరణాలను శ్వేతా వినియోగించుకునేది. తన ఐఫోన్‌ నుంచి కూడా నిఘా వేసినట్లు తెలిసింది. రాజకీయనేతలు, అధికారుల ఫోన్లలోని గ్యాలరీలోకి సైతం చొరబడే టెక్నాలజీ ఉందని సమాచారం. రహస్యంగా ఫోన్లు, వాట్సాప్‌ చాటింగ్, ఎస్‌ఎంఎస్, ఇతర విషయాలను రికార్డు చేసేవారు.  

మరిన్ని వార్తలు