వలపు వల.. చిక్కితే విలవిల

6 Nov, 2019 11:52 IST|Sakshi

హానీట్రాప్‌ మాయలో యువకులు

తియ్యటి మాటలతో యువతుల ఆకర్షణ

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు

కోల్‌కతాలో ఈ తరహా కాల్‌ సెంటర్లు  

జాగ్రత్త అంటున్న  పోలీసులు

సాక్షి, విశాఖపట్నం: కాలం మారింది.. వ్యభిచార ముఠాలు అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. కార్పొరేట్‌ కార్యాలయాలను తలపించేలా వ్యభిచార గృహాలను ఏర్పాటు చేసుకుని ఆన్‌లైన్‌ డేటింగ్‌ పేరిట రూ.కోట్లు కొల్లగొడుతున్నాయి. కుర్రకారును ఆన్‌లైన్‌లో ఎరవేసి.. ఆఫ్‌లైన్‌లో యువతులను పంపించి మధ్యవర్తిత్వం ద్వారా రూ.లక్ష వసూళ్లు చేస్తున్నాయి. కోల్‌కతా కేంద్రంగా నడిచే ఓ హానీట్రా‹ప్‌ మాయలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ మంది చిక్కుకుంటున్నారు. ఆరు నెలల కిందట హానీట్రా‹ప్‌ ముఠా మోసానికి బలైన నగరానికి చెందిన ఓ యువకుడు విశాఖ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన విశాఖ సైబర్‌ పోలీసులు రెండుసార్లు కోల్‌కతా వెళ్లారు. ఎక్కడా చిన్నపాటి క్లూ కూడా దొరకలేదు. దర్యాప్తులో భాగంగా మూడోసారి వెళ్లిన విశాఖ సైబర్‌ పోలీసులకు ఈ హానీట్రాప్‌ ముఠా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది. కార్పొరేట్‌ తరహాలో ఉన్న అక్కడ వాళ్ల ఆఫీస్, అందులో టెలీ కాలర్స్, గ్రాఫిక్‌ డిజైనర్స్, హెచ్‌ఆర్‌ మేనేజర్లతో సహా ఈ వ్యభిచార ముఠా.. పోలీసులనే అవాక్కయ్యేలా చేసింది.

పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు
తియ్యని మాటలతో ముగ్గులోకి..  
ఈ హనీట్రాఫ్‌ ముఠా కోల్‌కతాలో ‘ఓసులమ్‌ ఐటీ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరున ఓ సంస్థ ఏర్పాటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ముందుగా వివిధ రాష్ట్రాల నుంచి అందమైన అమ్మాయిలకు రూ.లక్షలు ఎరవేసి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పేరిట నియమించుకుంటోంది. అవసరాన్ని బట్టి వీళ్ల విధులు రకరకాలుగా మారుతూ ఉంటాయి. వీరికి కాల్‌ చేసే యువకులను, వీళ్లు చేసే యువకులను తియ్యటి మాటలతో హానీట్రా‹ప్‌తో ముగ్గులోకి దించుతారు. ప్రైవేట్‌ చాటింగ్, వీడియో కాలింగ్, డైరెక్ట్‌ స్పెండింగ్‌.. ఇలా రకరకాల ఆఫర్లను యువకుల ముందుంచుతారు. యువతలను బయటికు తీసుకెళ్లాలంటే హోటల్‌ గదులను బుక్‌ చేయడం దగ్గర నుంచి భోజన సౌకర్యాలతో సహా అన్నీ వీరే ఏర్పాటు చేస్తారు. అయితే వారు అడిగినంత డబ్బులు చెల్లిస్తేనే ఈ ఆఫర్‌లన్నీ చేస్తారు. లేదంటే యువకులకు మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ ఇస్తారు. వారి అభిరుచి మేరకు అనుగుణంగా నడుచుకుంటారు. డబ్బులు ఇచ్చే కన్నా ముందు వారికి అందమైన అమ్మాయిల ఫొటోలు పంపిస్తారు. అందులో ఎవరిదైనా ఫోన్‌ నంబర్‌ కావాలంటే వారు చెప్పిన మొత్తం ప్యాకేజీలో కొంత డబ్బు చెల్లించాలి. ఆ తర్వాతే వారికి ఆ అమ్మయి ఫోన్‌ నంబర్‌ ఇస్తారు. తర్వాత అమ్మాయి రంగంలోకి దిగుతుంది. అక్కడ నుంచి దఫాదఫాలుగా రూ.లక్షలు వసూళ్లు చేస్తారు.    ప్రతి రాష్ట్రంలోని ఈ ముఠా కొంత మంది బ్రోకర్లను నియమించుకుని అమాయకమైన.. అందమైన.. బాగా మాట్లాడే అమ్మాయిలకు ఎరవేసి ఉద్యోగం కల్పిస్తుంది. ఈ యువతులు కస్టమర్లను ఎంగేజ్‌ చేస్తే.. ఇన్‌సెంటివ్స్‌ పేరుతో అదనంగా జీతం ఇస్తారు. ఈ దందాలో వందలాది మంది బాధితులు తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారు. అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో యువకులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

యువతే టార్గెట్‌

యువతే టార్గెట్‌గా కోల్‌కతాలో ‘ఓసులమ్‌ ఐటీ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’తో పాటు చాలా వ్యభిచార హౌస్‌లు నడుపుతున్నట్లు విశాఖ పోలీసులు వెల్లడిస్తున్నారు. ఓసులమ్‌ సంస్థపై దాడి చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రూపం అనే వ్యక్తి ఈ తరహా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నట్లు సైబర్‌ పోలీసులు తెలిపారు. కోల్‌కతా సైబర్‌ పోలీసులకు అవగాహన తక్కువ ఉండడంతో.. అక్కడ కేంద్రంగానే ఎక్కువ ఈ తరహా నేరాలు జరుగుతున్నాయి. ఆరు నెలల కిందట విశాఖలో ఓ బాధితుడు ఇచ్చి న ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు .. వారం రోజుల కిందట ఆన్‌లైన్‌ వ్యభిచార ముఠాలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కాల్‌ సెంటర్‌పై దాడి చేసినప్పుడు 23 మంది యువతులతో పాటు, ఒక హెచ్‌ఆర్, ఆఫీస్‌ బాయ్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని అలిపూర్‌లోని అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచారు. వారి దగ్గర నుంచి 40 వరకు బేసిక్‌ ఫోన్లు, 5 ఆండ్రాయిడ్‌ ఫోన్లు, మూడు ల్యాపీలు, రూటర్, హార్డ్‌ డిస్ట్, కొన్ని సిమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను డిసెంబర్‌ 6న నగరంలోని చీఫ్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరుస్తారు.  

వెబ్‌సైట్లతో జాగ్రత్త
ఇంటర్నెట్‌లో పలు వెబ్‌సైట్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా పీపుల్‌ ఫ్రెండ్స్, కిన్‌ కీ, హానీ పికప్, ఫ్యాషన్, హాట్‌ టెంప్‌టేషన్‌ వంటి వెబ్‌సైట్లు ఉన్నాయి. ముఖ్యంగా వీరి వలలో నగరానికి చెందిన కొన్ని విభాగాల్లో ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం ఉంది. యువత ఇలాంటి వెబ్‌సైట్ల జోలికి వెళ్లవద్దు. తేనెలా మాట్లాడుతూ నెమ్మదిగా తమ వలలోకి దించి, లక్షల్లో డబ్బులు కాజేయటమే వీరి లక్ష్యం. విద్యార్థులు, యువకులు జాగ్రత్తగా ఉండాలి.  –సీఐ వి.గోపినాథ్‌  సైబర్‌ క్రైం

మరిన్ని వార్తలు