పరువు తీసిందని పొట్టన పెట్టుకున్నాడు

24 Aug, 2018 01:07 IST|Sakshi
కుమారుడితో సురేశ్, విజయలక్ష్మి దంపతులు (ఫైల్‌)

రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య

ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిని హతమార్చిన తండ్రి

మృతురాలు ఏడు నెలల గర్భిణి

పెద్దఅంబర్‌పేట (ఇబ్రహీంపట్నం): ‘పరువు’కు మరో ఆడ కూతురు బలయ్యింది. తనను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుందని, తమ పరువు తీసిందని నిండు గర్భిణి అని కూడా చూడకుండా కూతురును కిరాతకంగా హత్య చేశాడో తండ్రి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని అబ్దుల్లాపూర్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుందీ ఘటన.

తల్లి చనిపోయిందని రావడంతో..
అబ్దుల్లాపూర్‌ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఎల్లంకి కిష్టయ్య కుమారుడు ఎల్లంకి సురేశ్, పక్కింట్లో ఉండే మంగలిపల్లి నర్సింహ కూతురు విజయలక్ష్మి (27) ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఇంట్లో వారిని ఎదిరించిన విజయలక్ష్మి 2014లో సురేశ్‌ను వివాహం చేసుకుంది. భద్రాచలంలో కాపురం పెట్టింది. సురేశ్‌ తాపీ పని చేస్తూ విజయలక్ష్మిని పోషించుకుంటున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. విజయలక్ష్మి ప్రస్తుతం ఏడు మాసాల గర్భిణి.

ఈ నేపథ్యంలో ఈ నెల 19న సురేశ్‌ తల్లి సుక్కమ్మ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. అంత్యక్రియల కోసం సురేశ్‌ దంపతులు గ్రామానికి వచ్చారు. ఎప్పటి నుంచో విజయలక్ష్మి మీద పగ పెంచుకున్న కుటుంబ సభ్యులు ఆమెను హత్యచేసేందుకు పన్నాగం పన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు గ్రామపెద్దల దృష్టికి తీసుకురాగా ఇరు కుటుంబాలతో మాట్లాడారు. విజయలక్ష్మి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురాగా గురువారం ఊరి నుంచి పంపిస్తామని గ్రామపెద్దలు చెప్పా రు. దీంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కొట్టుకుంటూ తీసుకెళ్లి.. మెడ కోసి..
గురువారం ఉదయం తల్లి నర్సమ్మ, చిన్నమ్మలు వనమ్మ, లావణ్య, మంగమ్మ, యాదమ్మ, రాములమ్మ.. విజయలక్ష్మిని తమ వెంట తీసుకువెళ్లేందుకు వచ్చారు. వారిని చూసిన విజయలక్ష్మి ఇంట్లోకి వెళ్లగా ఆమెను బలవంతంగా సమీపంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లోకి లాక్కెళ్లారు. సురేశ్‌ కుటుంబసభ్యులు అడ్డుకుని బతిమిలాడినా పట్టించుకోకుం డా విజయలక్ష్మీని కొడుతూ తీసుకెళ్లారు. కమ్యూనిటీ హాల్‌లో కత్తితో సిద్ధంగా ఉన్న నర్సింహ ఆమె మెడను కోశాడు.

చీరతో విజయలక్ష్మి గొంతును గట్టిగా చుట్టి కుటుంబ సభ్యుల సహాయంతో హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. నర్సింహాతోపాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ అబ్దుల్లాపూర్‌మెట్‌ సీఐ మునితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన భార్యను హత్యచేసిన నర్సింహతోపాటు అతనికి సహకరించిన కుటుంబసభ్యులపై పోలీసులకు సురేశ్‌ ఫిర్యాదు చేశాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా