హుక్కా ఆన్‌ వీల్స్‌!

27 Mar, 2020 10:22 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఓమ్నీ వ్యాన్‌లోని హుక్కా

ఓమ్నీ వ్యానులో హుక్కా పార్లర్‌

వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ దందా

సాక్షి, సిటీబ్యూరో: హుక్కా పార్లర్లపై పోలీసుల నిఘా పెరగడంతో ఈ దందా చేసేవాళ్లు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ వాటిని అనుసరిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకులు, హుక్కా పీల్చే వారితో కలిపి మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, వీరి నుంచి ఓమ్నీ వాహనంతో పాటు రూ.2 లక్షల విలువైన హుక్కా సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి గురువారం వెల్లడించారు. పాతబస్తీలోని మచిలీ క కమాన్‌ ప్రాంతానికి చెందిన అలీ, అబ్దుల్‌ కరీం గతంలో రఫీఖ్‌ ట్రేడర్స్‌ పేరుతో హుక్కా వ్యాపారం నిర్వహించారు. సిటీలో హుక్కా పార్లర్స్‌ ను నిషేధించడం, అక్రమ వ్యాపారంపై పోలీసుల నిఘా పెరగడంతో ఈ ద్వయం కొత్త మార్గాలు అన్వేషించింది. కొన్ని నెలల క్రితం ఓ ఓమ్మీ వ్యాన్‌ ఖరీదు చేసిన వీరు అందులో కొన్ని మార్పులు చేసి తెరలు ఏర్పాటు చేశారు.

అనేక ప్రాంతాల నుంచి అక్రమంగా సేకరించిన హుక్కా పాట్స్, మెటీరియల్, వివిధ ఫ్లేవర్లు అందులో పెట్టుకుంటున్నారు. ఈ వాహనంతో సహా వీరిద్దరూ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. పరిచయస్తులు, వారి సిఫార్సుతో వచ్చిన వారికి ఆయా ఫ్లేవర్లకు చెందిన హుక్కా పాట్స్‌ అందిస్తున్నారు. దీనికి వారి నుంచి నిర్ణీత మొత్తం వసూలు చేస్తూ తమ వాహనం చాటునే కూర్చుని హుక్కా పీల్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా పాతబస్తీలో అనేక మంది కస్టమర్లను ఏర్పాటు చేసుకున్న ఈ ద్వయం వారి వద్దకే వెళ్తూ వారికి హుక్కా పీల్చుకునే అవకాశం ఇవ్వడంతో పాటు కొందరికి పాట్స్, హుక్కా ఫ్లేవర్స్‌ విక్రయిస్తోంది. కొన్నాళ్ళుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్క్‌ ఫోర్స్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్రకు సమాచారం అందింది. ఆయన నేత్రుత్వంలో రంగంలోకి దిగిన టీమ్‌ వలపన్ని మీర్‌చౌక్‌ ప్రాంతంలో వాహనాన్ని పట్టుకుంది. అందులో ఉన్న ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో ముగ్గురిని పట్టుకుంది. తదుపరి చర్యల నిమిత్తం వీరిని మీర్‌చౌక్‌ పోలీసులకు అప్పగించింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా