తమిళనాడులో అమ్మకానికి శిశువులు

26 Apr, 2019 09:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘పిల్లలు కావాలా బాబు.. బిడ్డను బట్టి రేటు’ అంటూ వాట్సాప్‌లో సందేశాలిస్తూ చిన్నారులను అమ్మేస్తున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ కేసులో రిటైర్డు నర్సు, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా రాశీపురం కేంద్రంగా రెండ్రోజులుగా ఒక వాట్సాప్‌ ఆడియో సందేశం వైరలయ్యింది.

‘బాబు కావాలా.. పాప కావాలా.. తెల్లగా ఉండాలా.. నల్లగా ఉన్నా పరవాలేదా? బిడ్డను బట్టి రేటు. మగబిడ్డకు రూ.4 లక్షల నుంచి రూ.4.50 లక్షలు, ఆడ బిడ్డయితే రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షలు. అముల్‌ బేబీ లాగా ఉంటే మరో రేటు. బిడ్డ కోసం కొంత అడ్వాన్సు చెల్లిస్తే వెంటనే సిద్ధం చేస్తాను. సంతానం లేని దంపతులకు 30 ఏళ్లుగా బిడ్డలను అమ్ముతున్నాను. రాశీపురం మున్సిపాలిటీ నుంచి కేవలం 25 నుంచి 30 రోజుల్లో బర్త్‌ సర్టిఫికెట్‌ను కూడా పొందేలా చేస్తాను. ఇందుకు మరో రూ.70 వేలు ఖర్చవుతుంది. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దు’’ అని రిటైర్డు నర్సు అముదవల్లి, ఆమె భర్త సేలం జిల్లా ఓమలూరుకు చెందిన దంపతులతో ఇటీవల జరిపిన సంభాషణ వాట్సాప్‌ ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో అముదవల్లి (50), ఆమె భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు