నిర్లక్ష్యానికి తప్పదు జైలు..!

26 Sep, 2018 08:46 IST|Sakshi

కిరాయిదారులపై కన్నేయనందుకు...

ఓ ఇంటి యజమానికి నెల రోజుల జైలు

ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు  

టెనెంట్స్‌ వెరిఫికేషన్‌పైసిటీలో నిర్లక్ష్య వైఖరి

ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నా చర్యలు శూన్యం

సాక్షి, సిటీబ్యూరో: 2007 ఆగస్టు... హబ్సిగూడలోని బంజారా నిలయంలో మకాం వేసిన ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాదులు గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో పేలుళ్లకు పాల్పడి ఉడాయించారు.
2013 ఫిబ్రవరి... మరోసారి సిటీని టార్గెట్‌ చేసిన ఐఎం టెర్రరిస్టులు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని అద్దె ఇంట్లో షెల్టర్‌ తీసుకున్నారు. అదును చూసుకుని దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పేల్చారు.
2013 డిసెంబర్‌... ముంబైకి చెందిన మోడల్‌ను ఈవెంట్‌ పేరుతో సిటీకి రప్పించిన కొందరు దుండగులు  నిజాంపేటలోని అద్దె ఇంటికి తీసుకెళ్లి బంధించారు. ఆపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.  

ఈ మూడు సందర్భాల్లోనూ పోలీసులు టెనెంట్స్‌ (ఆయా ఇళ్లల్లో అద్దెకు ఉన్న వారు) వివరాలు సేకరించేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. కేవలం ఇవే కాదు... అద్దెకు దిగిన ముష్కరులు చేసిన నేరాలు, ఘాతుకాలకు సిటీలో కొదవే లేదు. దీంతో టెనెంట్స్‌ వాచ్‌ పక్కాగా అమలు చేయాలని, కిరాయిదారుల పూర్తి వివరాలు సేకరించడంతో పాటు పోలీసులకూ సమాచారం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఇప్పటికీ దీనిపై స్పష్టమైన విధానం అమలులోకి రాలేదు.  

దేశ రాజధానిలోనూ..
దేశ రాజధాని ఢిల్లీకి వలసల బెడద ఎక్కువ. ఉద్యోగం, చదువు, వైద్యం తదితర అవసరాల నిమిత్తం నిత్యం వేలాదిమంది అక్కడికి వెళ్తుంటారు. వీరంతా ఎక్కువగా అద్దె ఇళ్లల్లోనే నివసిస్తుంటారు. దీనిని అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఉద్యోగాల ముసుగులో  అద్దె ఇళ్లల్లో తిష్టవేసిన ముష్కరులు పేలుళ్లకు పాల్పడటం నుంచి ఇంటి యజమానులనే దోచుకోవడం, హత్యలు వంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఆయా సందర్బాల్లో పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టేందుకు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. అద్దెకు దిగి, నేరాలు చేసిన వారి వివరాలు యజమానుల వద్ద లేకపోవడంతో ఇప్పటికీ అనేక కేసులు కొలిక్కిరాలేదు.  

ఢిల్లీ పోలీసు సీరియస్‌..
ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కొన్నేళ్ల క్రితమే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు కచ్చితంగా కిరాయిదారులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి, వాటిని స్థానిక పోలీసుస్టేషన్‌లో అందించాలని, పోలీసుల ద్దారా అద్దెకున్న వారిని వెరిఫై చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విచారణ నామమాత్రంగా కాకుండా అదనపు పోలీసు కమిషనర్‌ స్థాయి అధికారిచే చేయించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇళ్ల యజమానులు వీటిని పక్కాగా అమలు చేస్తున్నారా? లేదా? అనేది సరిచూసే బాధ్యతను బీట్‌ కానిస్టేబుళ్లకు అప్పగించారు. నిత్యం గస్తీ నిర్వహించే వీరు ఎవరైనా ఇంటి యజమానులు ఈ ఉత్తర్వులను ఉల్లంఘించారా? అనే అంశాన్ని పక్కాగా పరిశీలిస్తుంటారు.  

అడ్డంగా బుక్కైన నిరంజన్‌...
తూర్పు ఢిల్లీలోని పాండవ్‌నగర్‌కు చెందిన నిరంజన్‌ మిశ్రా తన ఇంటిని నాలుగేళ్ల క్రితం కొందరికి అద్దెకు ఇచ్చారు. అప్పటి నుంచి వారి వివరాలు సేకరించడం, స్థానిక పోలీసుస్టేషన్‌లో అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. నెల రోజుల క్రితం పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న హెడ్‌–కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌ దీనిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిరంజన్‌పై ఐపీసీలోని సెక్షన్‌ 188 (ప్రభుత్వ అధికారి ఆదేశాలను బేఖాతరు చేయడం) సెక్షన్‌ కింద కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన ఢిల్లీ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ గత గురువారం నిరంజన్‌ను దోషిగా తేలుస్తూ నెల రోజుల జైలు శిక్ష విధించారు. ఈ నేపథ్యంలోనే నిరంజన్‌ చర్య క్షమించరానిదని వ్యాఖ్యానించారు. ఇకపై ప్రతి యజమాని కిరాయిదార్ల వివరాలు సేకరించడం తప్పనిసరని స్పష్టం చేశారు.  

నగరంలో అమలుకు దూరమే...
సిటీలోనూ ఈ విధానం అమలు చేయాలని 2007 నుంచి పోలీసులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నేరాల కోసం వస్తున్న ముష్కరులకు షెల్టర్‌ దొరక్కుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలులోకి రాలేదు. ఒకప్పుడు ప్రత్యేకంగా ‘టెనెంట్స్‌ వాచ్‌ ఫామ్‌’ దరఖాస్తులను రూపొందించి ఠాణాల వారీగా అందుబాటులో ఉంచేవారు. అప్పట్లో ఇంటి యజమానులు పోలీస్టేషన్‌కు వెళ్ళి వీటిని అందించాల్సి వచ్చేది. దీంతో అనేక మంది ఆసక్తి చూపడం లేదని భావించి పోలీసు అధికారిక యాప్‌ ‘హాక్‌ ఐ’లో లింకు ఇచ్చినా ఫలితం లేదు. ‘ఢిల్లీ తీర్పు’తో అయినా పోలీసులు తమ విధానాలు మార్చుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. టెనెంట్స్‌ వెరిఫికేషన్‌ విధానం  కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే ప్రజా భద్రతా చట్టంలో సవరణలు చేసి ఈ అంశాన్ని చేర్చాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు