మూగజీవిపై ఇంటి యజమాని ప్రతాపం

28 Aug, 2018 07:19 IST|Sakshi
నురగలు కక్కుతున్న కుక్క చార్లెస్‌ రూబీ

అద్దెకున్న వారిపై కోపంతో కుక్కను చావబాదిన వైనం

సాక్షి, విశాఖపట్నం ,గాజువాక: అత్తపై కోపాన్ని దుత్తపై చూపించాడన్న సామెతను నిజం చేశాడో ప్రబుద్ధుడు. తన ఇంట్లో అద్దెకున్న వారిని ఏమీ చేయలేక వారు పెంచుకొంటున్న కుక్కపై తన ప్రతాపం చూపించాడు. అద్దెకున్న వారు ఇంట్లోలేని సమయంలో ఒక పెద్ద కర్ర తీసుకొని వారి కుక్కను చావబాదాడు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు సంబంధిత వ్యక్తిపై గాజువాక పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టించారు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరా కలీం అనే మహిళ తమ కుటుంబంతో కలిసి స్థానిక చినగంట్యాడ ఈ – సేవా కేంద్రం సమీపంలోని బి.రవిబాబు ఇంట్లో అద్దెకు నివాసముంటున్నారు. యజమాని అనుమతితో ఒక కుక్కపిల్ల (చార్లెస్‌ రూబీ)ను కూడా తీసుకొచ్చి పెంచుకొంటున్నారు.

ఏడాది కాలంగా ఇంటి యజమానికి, ఆమెకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. అగ్రిమెంట్‌ అమల్లో ఉండగానే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి చేయడంతో ఫ్లోరా నిరాకరించారు. తనకున్న ఇబ్బందులను వివరించి కొద్దికాలంపాటు ఇల్లు ఖాళీ చేయలేనని తెలిపారు.  ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నడుస్తుండగానే ఈ నెల 23న సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తమ చర్చి ఫాదర్‌ మెమోరియల్‌ ప్రేయర్‌కు కుటుంబంతో సహా ఆమె వెళ్లిపోయారు. ఆ సమయంలో కుక్కను బాల్కనీలో కట్టారు. రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి వచ్చిన వారికి కుక్క శబ్ధం చేయకపోవడంతో ఏదో అనుమానం శంకించింది. తీరా బాల్కనీలో చూస్తే కుక్క అపస్మారక స్థితిలో పడి ఉంది. దాన్ని కదిపి చూసేసరికి నోటి నుంచి నురగలు కక్కడం, ఒక్కసారిగా రక్తంతో కూడిన వాంతి చేసుకోవడంతో ఆందోళన చెందారు. అనంతరం తేరుకొని కుక్కకు వైద్యం చేయించారు. ఈ విషయంపై జంతు సంరక్షణ సొసైటీ ప్రతినిధులతో కలిసి గాజువాక పోలీసులకు
25వ తేదీ న ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు పోలీసుల పరిశీలనలో ఉంది.

మరిన్ని వార్తలు