మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి?

23 Jul, 2020 08:01 IST|Sakshi

అనుమానాస్పద స్థితిలో సృహ కోల్పోయిన తల్లీ కూతురు, కుమారుడు  

చికెన్‌ కూరలో మత్తు మందు కలిపారనే అనుమానం

ఇంటి యజయానితో సహా ఇద్దరిని విచారిస్తున్న పోలీసులు  

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు  

చందానగర్‌: అనుమానాస్పద స్థితిలో ఓ కుటుంబంలోని తల్లి, కూతురు, కొడుకు స్పృహ కోల్పోయారు. ఇంటి యజమానే  చికెన్‌లో మత్తుమంది కలిపి ఆపై లైంగిక దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చందానగర్‌ పీఎస్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  సీఐ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని షోలాపూర్‌ కు చెందిన ఓ కుటుంబం కొద్ది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. శేరిలింగంపల్లిలోని సందయ్యనగర్‌లో బాధిత మహిళ (35), భర్త, కూతురు (15) కొడుకు (10) నివాసం ఉంటున్నారు. వీరు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి ఇంటి యజమాని అయిన గంగాధర్‌ ‡(45) మసీద్‌బండలో ఉంటూ టైలర్‌గా పని చేస్తున్నాడు. సందయ్యనగర్‌ లోని తన ఇంటిలోని ఒక పోర్షన్‌ వీరికి అద్దెకు ఇవ్వగా.. మిగతా పోర్షన్‌లు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఇంటిని యజమాని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో మంగళవారం గంగాధర్‌ తన అసిస్టెంట్‌లు నగేష్‌ (48), గణేష్‌(40)తో కలిసి వచ్చాడు. చికెన్‌ తీసుకువచ్చి అద్దెకుంటున్న మహిళకు వండిపెట్టమని ఇచ్చారు.

సదరు మహిళ చికెన్‌ వండి ఇవ్వగా.. వారు తిన్న తర్వాత మిగిలిన చికెన్‌ను ఆమెకు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 4 గంటల ఆ చికెన్‌ తిన్న తల్లి, కుతురు, కొడుకు  సృహ కోల్పోయారు. కూలీ పనులు ముగించుకొని రాత్రి 9 గంటలకు భర్త ఇంటికి వచ్చాడు. వచ్చే సరికి  భార్య, కూతురు, కొడుకు స్పృహతప్పి పడి ఉన్నారు. ఆందోళన చెందిన అతను  స్థానికుల సహాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించగా స్పృహలోకి వచ్చారు.  చికెన్‌ తిన్న తర్వాత తాము  స్పృహ కోల్పోయామని భర్తతో మహిళ చెప్పింది.  చికెన్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి అనంతరం తల్లి, కూతరుపై లైంగిక దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బాధితులు బుధవారం చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి యజమానిని, అసిస్టెంట్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులకు పరీక్షలు చేయించామని రిపోర్ట్స్‌ వచ్చాకే  మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డారా..? లేదా...? అన్న విషయం తెలుస్తుందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. తల్లీకూతుళ్లు ఉస్మానియాలో, కొడుకు నిలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

చికెన్‌ తిన్న తర్వాతే స్పృహ తప్పింది....
ఇంటి యజమాని గంగాధర్, నగేష్, గణేష్‌లు మంగళవారం సాయంత్రం వచ్చి చికెన్‌ వండి ఇవ్వమని ఇచ్చారని బాధిత మహిళ తెలిపింది. మిగిలిన చికెన్‌ ఇవ్వగా కూతురు, కొడుకుతో పాటు తాను తిన్నామని తెలిపింది. కొద్ది సేపటికే కళ్లు తిరిగి స్పృహ కోల్పోయామని ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదన్నారు. గత మూడు రోజులుగా వారు ఇక్కడికి వస్తున్నారని, వారితో గుర్తు తెలియని అమ్మాయిలు వస్తున్నారని చెప్పింది. రూ.20 వేలు ఇస్తామని పోలీసులకు చెప్పవద్దని మధ్యవర్తులచే ముగ్గురు వ్యక్తులు చెప్పించారని పేర్కొంది.

మరిన్ని వార్తలు