ఘోర అగ్నిప్రమాదం.. 41 మంది దుర్మరణం

26 Jan, 2018 19:58 IST|Sakshi

సియోల్: దక్షిణ కొరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో దాదాపు 41 మంది మృతిచెందగా, దాదాపు 80 మంది గాయపడ్డట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాంగ్‌ నగరంలోని సెజాంగ్‌ ఆస్పత్రిలో నేటి ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తులో ఎవర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు అనంతరం భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో పేషెంట్లు, వారి బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి దద్దరిల్లింది.

ప్రమాద సమయంలో సుమారు 200 మంది హాస్పిటల్‌లో ఉన్నారు. 41 మందిని మంటలు పొట్టన పెట్టుకున్నాయని, మరో 80 మందికి కాలిన గాయాలయ్యాయి. ఇందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఇతర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో శీతాకాల ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దక్షిణ కొరియాలో కొన్ని రోజుల ముందు భారీ అగ్ని ప్రమాదం సంభవించడం ఇతర దేశాల క్రీడాకారులను, అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ విషాద ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంబంధితశాఖ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసిన అధ్యక్షుడు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయడంతో పాటు ఘటనపై విచారణకు ఆదేశించారు. గతేడాది డిసెంబర్‌లో జెచియాన్ నగరంలోని ఫిట్‌నెస్ క్లబ్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో 29 మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే.

   

మరిన్ని వార్తలు