అమరావతిలో భారీ మోసం

30 Nov, 2019 10:55 IST|Sakshi
బాధితులతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ శివనాగరాజు

ముందుగా ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్‌  

పొలం పాస్‌పుస్తకాలు, డాక్యుమెంట్ల స్వాధీనం 

విడతలవారీగా పొలం రిజిస్ట్రేషన్‌కు బాధితులను తీసుకొచ్చిన వైనం

అమరావతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 

విచారణ చేస్తున్న పోలీసులు  

అమరావతి:  కుటుంబ సభ్యులందరినీ కిడ్నాప్‌ చేసి హింసించి 6 ఎకరాల 33 సెంట్ల పొలాన్ని దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఘటన అమరావతి మండల పరిధిలోని ధరణికోటలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు... ధరణికోటకు చెందిన పెనుమచ్చు హనుమంతరావుకు గ్రామంలో సుమారు 22 ఎకరాల పొలం ఉంది. ఆయన ఏకైక కుమార్తె సరితను అదే గ్రామానికి చెందిన వడ్లమూడి రమేష్‌బాబుకు ఇచ్చి వివాహం చేశారు. వివాహానంతరం రెండు కుటుంబాలూ కలిసే ఉంటున్నారు. వీరంతా క్రిస్టియన్‌ మతం తీసుకోవటంతో ఎక్కువ సమయం దైవ ప్రార్థనలో ఉంటూ పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చేకూరి వెంకటేశ్వరరావు వారి పొలంపై కన్నేసి.. కాజేసేందుకు పథకం పన్నాడు. రెండు నెలల నుంచి వడ్లమూడి రమేష్‌బాబుకు రెండు మూడు రోజులకోసారి కొత్త నంబర్ల నుంచి ఫోన్‌ చేస్తూ.. మీ పొలం ప్రకృతి వ్యవసాయం చేయడానికి కౌలుకు కావాలని అడుగుతున్నాడు.

ఈ నేపథ్యంలో కౌలు మాట్లాడుకుందామంటూ గ్రామంలోని జైల్‌సింగ్‌ కాలనీ రోడ్డులోని గ్రామానికి దూరంగా నిర్జన ప్రదేశంలో ఉన్న ఇంటికి రావాలని అక్టోబర్‌ 19న రమేష్‌బాబుకు ఫోన్‌లో సూచించాడు. దీంతో ఆయన తన ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లగా, అప్పటికే ముఖానికి ముసుగులు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు రమేష్‌బాబును తాళ్లతో బంధించి నోటికి ప్లాస్టర్‌ అంటించారు. వీరుగాక నాలుగో వ్యక్తి కూడా ముఖానికి ముసుగు వేసుకొని వచ్చి రమేష్‌బాబును ఆస్తి వివరాలు చెప్పాలని బెదిరించి హింసించాడు. అక్టోబర్‌ 20న రమేష్‌బాబు మామ హనుమంతరావు వద్దకు వెళ్లి మీ అల్లుడికి యాక్సిడెంట్‌ జరిగిందంటూ ఆయన్ని హడావుడిగా తీసుకొచ్చి మరో గదిలో బంధించారు. వారిద్దరితో కుటుంబసభ్యులకు ఫోన్‌ చేయించి పొలాలకు సంబంధించిన కాగితాలు, పాస్‌ పుస్తకాలతో పాటు కారును కూడా తాము పంపించిన వ్యక్తికి ఇచ్చి పంపించాలని బలవంతంగా చెప్పించారు.

సినీ ఫక్కీలో రిజిస్ట్రేషన్‌...
పొలం పత్రాలు చేతికి రాగానే అక్టోబర్‌ 21న రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేసి గదుల్లో బంధించిన వారిని విడతలవారీగా రిజిస్ట్రార్‌ ఆఫీసుకు సినీ ఫక్కీలో తీసుకొచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇంట్లోని పెద్దవారంతా రిజిస్ట్రార్‌ ఆఫీసు వద్ద ఉన్నప్పుడు గొడవ చేయకుండా ఉండేందుకు తొమ్మిదో తరగతి చదువుతున్న రమేష్‌బాబు కుమారుడు శైలేష్‌ను గదిలో ఉంచి వారిని బెదిరించారు. హనుమంతరావు, రమేష్‌బాబు కుటుంబసభ్యులతో 240 సర్వే నంబరులోని 2.31 ఎకరాలు ముప్పాళ్ల మండలం కుందూరువారిపాలేనికి చెందిన వలిపాటి వెంకటేశ్వర్లుకు, 204/1బీ సర్వే నంబరులో ఉన్న 2.27 ఎకరాలు మునగోడు గ్రామానికి బత్తున నారయ్యకు, 341/2సీ సర్వే నంబరులో ఉన్న 1.75 ఎకరాలను నిందితుడు భార్య నాగస్వరూప పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు.

అనంతరం మామా అల్లుళ్లు హనుమంతరావు, రమేష్‌బాబును కారులో దూరంగా తీసుకెళ్లి ఈ విషయం పోలీసులకు గానీ, గ్రామంలో వారికి గానీ చెబితే చెన్నైలో బీటెక్‌ చదువుతున్న రమేష్‌బాబు కుమార్తె జ్యోతిర్మయిని  చంపేస్తామని బెదిరించి వదిలేశారు. ఈ నేపథ్యంలో బీటెక్‌ పరీక్షలు రాసి మూడు రోజుల క్రితం జ్యోతిర్మయి ఇంటికి రావటంతో కుటుంబ సభ్యులంతా ధైర్యాన్ని కూడదీసుకుని గురువారం రూరల్‌ జిల్లా ఎస్పీ విజయారావును ఆశ్రయించారు. అయన సూచన మేరకు బాధితుడు వడ్లమూడి  రమేష్‌బాబు అమరావతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం తుళ్లూరు డీఎస్పీ వై.శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షణలో పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి సీఐలు శివనాగరాజు, సుబ్బారావు, ఎస్‌ఐ శివయ్య తమ సిబ్బందితో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.    

>
మరిన్ని వార్తలు