కార్ఖానా గుట్టు డిజైనర్‌కు ఎరుక

2 Apr, 2018 01:55 IST|Sakshi
సీసీ కెమెరాకు చిక్కిన బంగారం చోరీ చేసిన దొంగలు(ఫైల్‌)

     అతడిచ్చిన సమాచారంతోనే పేట్లబురుజు కార్ఖానాలో దోపిడీ 

     పక్కా ప్రథకం ప్రకారం వ్యవహరించిన సూత్రధారి అమ్జద్‌ 

     మొత్తం నిందితులు 9 మంది, ప్రత్యక్షంగా పాల్గొన్నది 8 మంది 

     నలుగురి అరెస్ట్‌.. పరారీలో ఉన్న వారి కోసం వేట 

సాక్షి, హైదరాబాద్‌: ముంబైకి చెందిన బందిపోటు ముఠాకు.. పాతబస్తీలోని పేట్లబురుజులో మారుమూలన ఉన్న బంగారు నగల కార్ఖానా వివరాలు ఎలా తెలిశాయి? ఇప్పటి వరకు దర్యాప్తు అధికారుల్ని వేధించిన ప్రశ్న ఇదీ. కార్ఖానాలో పని చేస్తున్న, పని చేసి మానేసిన వారెవరైనా సమాచారం ఇచ్చి ఉండొచ్చని ప్రాథమికంగా భావించినా.. డెకాయిటీ గ్యాంగ్‌కు ‘చిరునామా’ చెప్పింది ఓ జ్యువెలరీ డిజైనర్‌ అని తాజాగా గుర్తించినట్టు తెలిసింది. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు కాగా.. ఆ రోజు కార్ఖానాలోకి ప్రవేశించి, దోచుకుంది ఎనిమిది మందిని ప్రాథమికంగా నిర్థారించినట్లు సమాచారం. ఇప్పటికే నలుగురు చిక్కగా.. మరో ఐదుగురి కోసం గాలిస్తున్న పోలీసులు 3.5 కేజీల బంగారం రికవరీపైనా దృష్టి పెట్టారు. ముంబైకి చెందిన మహ్మద్‌ మసూద్‌ ఖాన్‌ అలియాస్‌ రియాజ్‌ను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకుని చార్మినార్‌ పోలీసులకు అప్పగించిన విషయం విదితమే. కేసులో అదనపు వివరాలు సేకరించడానికి పోలీసులు మసూద్‌ను న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

సెప్టెంబర్‌లోనే బీజం.. 
ముంబైకి చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్‌ తరచుగా నిథాయిదాస్‌కు చెందిన పేట్లబురుజులోని కార్ఖానాకు అనేకసార్లు వచ్చి తాను రూపొందించిన డిజైన్లను చూపించేవాడు. అక్కడ లావాదేవీలు, సెక్యూరిటీ ఏర్పాట్లు తక్కువగా ఉన్న విషయం గుర్తించిన అతడు ఈ విషయాన్ని తన స్నేహితుడైన ముంబైలోని థానే వాసి అమ్జద్‌ ఖాజాకు చెప్పాడు. సదరు కార్ఖానాలో నగల్ని ఎక్కడ దాస్తారనే దానిపై ఉప్పందించాడు. దాదాపు 40 దోపిడీ, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్న అమ్జద్‌ జ్యువెలరీ డిజైనర్‌ ఇచ్చిన సమాచారంతో గత సెప్టెంబర్‌లోనే ఈ కార్ఖానాను టార్గెట్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ నెలతో పాటు ఫిబ్రవరిలో సిటీకి వచ్చి రెక్కీ చేసి వెళ్లాడు. కార్ఖానా ఎక్కడ ఉంది? దానికి ఎలా రావాలి? ఏఏ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి? ఎలా వెళితే పోలీసుల దృష్టి మళ్లించే అవకాశం ఉంది? ఇలాంటి అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పక్కా స్కెచ్‌ వేశాడు. 

పథకం ప్రకారం ‘వచ్చి వెళ్లిన’గ్యాంగ్‌.. 
ముంబైలో వివిధ ప్రాంతాలకు చెందిన పాత నేరగాళ్లు, స్నేహితులైన ఏడుగురితో ముఠా కట్టిన అమ్జద్‌ ఆఖరి నిమిషం వరకు టార్గెట్‌ ఏమిటన్నది వారికి చెప్పలేదు. గత నెల 5న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి నలుగురికి, శివార్లలో ఉన్న కల్యాణి ప్రాంతం నుంచి మరో నలుగురికి రిజర్వేషన్లు చేయించాడు. ఇద్దరిద్దరు చొప్పున జట్టుగా ఏర్పాటు చేసిన అమ్జద్‌ ఒకరి వివరాలు మరొకరికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. తమ వెంటే ఆయుధాలు తెచ్చుకున్న అమ్జద్, షాకీర్, జాకీర్, మసూద్‌ వీటితో ముంబై రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కితే తనిఖీల్లో చిక్కే ప్రమాదం ఉందని భావించి.. దాదర్‌ స్టేషన్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. అమ్జద్, షాకీర్, జాకీర్, మసూద్‌ ఆరో తేదీ ఉదయం బేగంపేట రైల్వేస్టేషన్‌లో దిగారు. మిగిలిన నలుగురూ మరో ప్రాంతంలో రైలు దిగారు. ఇద్దరు చొప్పున వేర్వేరుగా లోకల్‌ రైళ్ళు, ఆటోలు వినియోగించి పేట్లబురుజు ప్రాంతానికి చేరుకున్నారు. సమీపంలోనే సిటీ కాలేజీ ఉండటంతో విద్యార్థులుగా భావిస్తారని తమ వెంట కాలేజీ బ్యాగ్స్‌ తెచ్చుకున్నారు. 

పారిపోతూ.. దృష్టి మళ్లించే యత్నం.. 
గత నెల 6వ తేదీ మధ్యాహ్నం కార్ఖానా సమీపంలో ఎనిమిది మందీ కలుసుకున్నారు. కేవలం కనుసైగలతో ‘మాట్లాడుకుంటూ’కార్ఖానాపై దాడి చేసి 3.5 కేజీల ఆభరణాల ఎత్తుకుపోయారు. ఆ తర్వాత ఇద్దరు చొప్పునే ఆటోల్లో పేట్లబురుజు నుంచి బయలుదేరారు. ఘటనాస్థలంలోని సీసీ కెమెరాల్లో చిక్కినా.. తమను గుర్తించకుండా ఆటోలోనే షర్టులు మార్చారు. అక్కడ నుంచి లక్డీకాపూల్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లిన దుండగులు లోకల్‌ రైలులో బేగంపేట రైల్వేస్టేషన్‌ చేరుకున్నారు. అక్కడ నుంచి హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో షోలాపూర్‌కు అట్నుంచి ముంబైకి పారిపోయారు. 

మరిన్ని వార్తలు