అరణ్యంలో వేటగాళ్లు!

18 Apr, 2018 03:06 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న సెర్చ్‌లైట్, టార్చిలైట్లు

     అటవీ శాఖ అధికారుల అదుపులో ప్రముఖుల పిల్లలు?

     సెర్చ్‌లైట్లు, బైనాక్యులర్లు స్వాధీనం 

మెదక్‌ జోన్‌: సమయం తెల్లవారు జామున 4 గంటలు.. చేతిలో సెర్చ్‌ లైట్లు, బైనాక్యులర్లతో నలుగురు యువకులు పోచారం అభయారణ్యం ప్రాంతంలో తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వారిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. డీఎఫ్‌ఓ పద్మజరాణి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులు మంగళవారం మెదక్‌ జిల్లా హవేళిఘనాపూర్‌ మండలం బూర్గుపల్లి శివారులోని పోచారం అభయారణ్యం వద్ద  తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెర్చ్‌ లైట్లతో పాటు బైనాక్యులర్లను, బ్రీజా కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి వెళ్తుండగా దారితప్పి వచ్చినట్లు వారు చెబుతున్నారని  తెలిపారు. కానీ వారి వద్ద సెర్చ్‌ లైట్లు ఉండటంతో అనుమానితులుగా కేసు నమోదు చేసి కోర్టుకు పంపనున్నామని పేర్కొన్నారు.

వేటకోసమే వచ్చారా? 
పట్టుబడ్డ యువకుల వద్ద సెర్చ్‌లైట్లు బైనాక్యులర్లు చూస్తుంటే వారు వేట కోసమే వచ్చి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. అధునాతన సెర్చ్‌లైట్లు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతువులను నిలువరింపజేస్తుందని, బైనాక్యులర్లు సైతం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేనినైనా స్పష్టంగా చూడవచ్చునని పలువురు చెబుతున్నారు. గతంలో మెదక్, హవేళిఘణాపూర్, నర్సాపూర్‌ తదితర అడవుల్లో వేటగాళ్లు జింకలు, కొండ గొర్రెలు, ఏదులను వేటాడిన ఘటనలు అనేకం ఉన్నాయి. 

అన్నీ అనుమానాలే.. 
పోచారం అటవీ ప్రాంతం వద్ద పట్టుబడ్డ నలుగురు యువకులను ఫారెస్ట్‌ అధికారులు మీడియా ముందు ప్రవేశ పెట్టకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వారి పేర్లను సైతం వెల్లడించకపోవడం చూస్తుంటే పట్టుబడ్డ వారు ప్రముఖుల పిల్లలుగా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు