ప్రాణంతీసిన వివాహేతర సంబంధం

20 May, 2020 11:26 IST|Sakshi
రాజేందర్‌(ఫైల్‌) మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ గౌస్‌బాబా, సీఐ రవికుమార్‌

వేంపేటలో పట్టపగలే యువకుడి దారుణ హత్య

పరారీలో నిందితులు

మెట్‌పల్లి(కోరుట్ల) : వివాహేతర సంబంధం యువకుడి ప్రాణం తీసింది.  మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని ఆమె భర్త రెండు నెలలక్రితం హతమార్చడానికి ప్రయత్నించగా, ఆ సమయంలో త్రుటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం మరోసారి జరిపిన దాడిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపేటకు చెందిన దనరేకుల రాజేందర్‌(28) అనే యువకుడు గ్రామంలో ఉపాధిహామీ పథకంలో మేట్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య హరిణితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా రాజేందర్‌కు అదే గ్రామానికి చెందిన రమేశ్‌ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. గల్ఫ్‌లో ఉన్న ఆమె భర్త విషయం తెలుసుకొని కొన్ని నెలలక్రితం తన సోదరుడు మహేశ్‌తో కలిసి గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి రాజేందర్‌పై కక్ష పెంచుకున్న సోదరులు ఇద్దరు గత మార్చి 3న గ్రామశివారులో అతడిపై కత్తితో దాడి చేసి పారిపోయారు. (అమ్మా.. నేనూ నీవెంటే!)

ఈ సంఘటనలో రాజేందర్‌ ప్రాణాలతో బయటపడగా పోలీసులు రమేశ్, మహేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అనంతరం ఇద్దరు కొన్నిరోజులకు బెయిల్‌పై గ్రామానికి వచ్చారు. ఆ తర్వాత కూడా రాజేందర్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలనే ఆలోచనతో సోదరులిద్దరు అతడి కదలికలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామశివారులో ఉపాధి పనులు ముగిసిన తర్వాత కూలీగా వచ్చిన తన తల్లిని ఉదయం 11.30 సమయంలో ఇంటి వద్ద దించి తిరిగి రాజేందర్‌ అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న రమేశ్, మహేశ్‌లు అతడిపై గొడ్డలితో దాడి చేశారు. మెడపై విచక్షణరహితంగా నరకడంతో అక్కడిక్కక్కడే రాజేందర్‌ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు పారిపోయారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ గౌసుబాబా, సీఐ రవికుమార్, ఎస్సై çసుధాకర్‌ గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. దాడికి సంబంధించి పలు కోణాల్లో విచారణ జరిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా తనను ఇంటి వద్ద దించిన కొన్ని క్షణాలకే కుమారుడు మృత్యువాతపడడంతో సమాచారం తెలుసుకున్న రాజేందర్‌ తల్లి లక్ష్మీ మృతదేహం వద్దకి వచ్చి బోరున విలపించింది. మరోవైపు రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి రాజేందర్‌ భార్య హరిణి గుండెలవిసేలా రోదించింది.(సడలింపులు.. ‘తొలి’ కేసు)

మరిన్ని వార్తలు