అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

9 Mar, 2020 12:54 IST|Sakshi
కుమారి మృతదేహం ,వెంకన్న బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఘోరం

రాజానగరం: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా మహిళలను కీర్తిస్తూ సభలు, సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఓ భర్త అనుమానంతో భార్యను అమానుషంగా హతమార్చాడు. తాగుడుకు బానిసైన అతడు వాస్తవాలను విస్మరించి, విచక్షణా రహితంగా పీక నులిమి చంపేశాడు. దీంతో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు మాతృమూర్తిని కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి... నామవరానికి చెందిన ఈలి వెంకన్న తాపీ పని చేస్తుంటాడు. 15 సంవత్సరాల క్రితం రాజమహేంద్రవరానికి చెందిన కుమారితో వివాహం జరిగింది. వారికి 12, 8 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసైన వెంకన్న భార్యపై అనుమానం పెట్టుకుని తరచు గొడవ పడుతూ, కొడుతూ హింస పెడుతుండేవాడు. అతను పెట్టే బాధలను భరిస్తూ, పిల్లలను బాగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలనే తలంపుతో కుమారి సర్దుకుపోతూ వచ్చింది. 

ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా ఇంటికి తాగి వచ్చిన వెంకన్న లేనిపోని అనుమానాలను వ్యక్తపరుస్తూ భార్యతో గొడవపడ్డాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తెల్లవారే సరికి కుమారి మంచంపై చనిపోయివుండటం, ఇంట్లో భర్త వెంకన్న లేకపోవడంతో స్థానికులు అనుమానించారు. విషయం తెలుసుకున్న రాజానగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మరణానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మృతురాలి పీకపై చేతి గోళ్లతో అయిన గాయాలు ఉండటంతో ఆమెను పీక నులిమి హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో రాత్రి గొడవ పడిన భర్త ఇంటిలో లేకపోవడంతో అతని కోసం గాలిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న రాజానగరం సీఐ ఎంవీ సుభాష్‌ తెలిపారు. ఈ మేరకు వీఆర్‌ఏ గణేష్‌ నుంచి రిపోర్టు తీసుకుని తదనుగునంగా కేసు నమోదు చేశామన్నారు. స్థానికులు, వెంకన్న బంధువులు కూడా కుమారిని ఆమె భర్త వెంకన్నే హత్య చేశాడంటున్నారు. తాగుడుకు బానిసై లేనిపోని అనుమానం పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని వారు విచారణలో పోలీసులకు తెలిపారు. 

మరిన్ని వార్తలు