శాడిస్టు భర్త

18 Jan, 2019 12:59 IST|Sakshi
భర్త చేతిలో గాయపడిన పరిశుద్ధమ్మ, ఆమె పిల్లలు

 భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన భార్య

30 రోజులుగా వైద్యం అందక రిమ్స్‌లో నరకయాతన

గర్భిణి కావడంతో చికిత్స చేసేందుకు ఇష్టపడని వైద్యులు

గర్భస్రావం చేసైనా కాపాడాలని వేడుకుంటున్న బాధితురాలు

ఒంగోలు: భర్త చేతిలో తీవ్రంగా గాయపడి వైద్యం అందక ఓ మహిళ 30 రోజులుగా రిమ్స్‌లో నరకయాతన అనుభవిస్తోంది. ఆమెకు వైద్యం చేస్తే ఇబ్బందులు వస్తాయేమోనన్న అనుమానంతో చికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు.పైగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధిత మహిళ, ఆమె తల్లి గురువారం ‘సాక్షి’ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. చికిత్స అందించమని వైద్యులను కోరుతుఆన్న పట్టించుకోవడం లేదని, మరో వైపు వెలిగండ్ల పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేసు నమోదు చేయడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీ..జరిగింది
వెలిగండ్ల మండలం నరసాంబపురం గ్రామానికి చెందిన దుగ్గినపల్లి పరిశుద్ధమ్మకు ఆమె భర్త రూ.2 వేలు ఇచ్చి సంక్రాంతి సందర్భంగా కొత్త దుస్తులు కొనమని సూచించాడు. భర్తే అందులో వెయ్యి రూపాయలు తీసుకొని పూటుగా మద్యం తాగి ఇంటికి చేరాడు. ఈ విషయంలో దంపతుల మధ్య వివాదం చెలరేగింది. దుడ్డు కర్రతో ఇష్టం వచ్చినట్లు భార్యను బాదాడు. తల్లికి అడ్డు వచ్చి పదేళ్ల కుమార్తె సైతం తండ్రిని నిలదీసింది. ఇష్టం వచ్చినట్లు తాగుతుంటే బయట తలెత్తుకు తిరిగలేకపోతున్నామని ప్రశ్నించడంతో అదే కర్రతో కుమార్తెపైనా దాడికి తెగబడ్డాడు. పాప దీపిక ఎడమ చేయి విరిగింది. మరో వైపు పరిశుద్ధమ్మ కాలు విరిగింది. ఆ రోజు ఎవరూ పట్టించుకోలేదు. ఇద్దరు తీవ్ర నొప్పులతో రోదిస్తుండడంతో మరునాడు అంటే పండగ రోజు కనిగిరి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. కనిగిరి పోలీసులు విచారిస్తే తల్లితో పాటు పాప కూడా తమను కొట్టిన విషయాన్ని బహిర్గత పరిచారు. తల్లి గర్భవతి కావడంతో మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. ఆమె డిసెంబర్‌ 25వ తేదీ అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో రిమ్స్‌లో చేరింది. ఆమెను ఇన్‌పేషెంటుగా వార్డు నంబర్‌ 115లో చేర్చారుగానీ వైద్యం విషయంలో వైద్యులు వెనుకంజ వేస్తున్నారు.

డాక్టర్లు కరుణించాలి
నా బిడ్డలు ముగ్గురూ పదేళ్ల లోపు వారే. భర్త మద్యానికి బానిసయ్యాడు. ప్రస్తుత పరిస్థితిలో ఆయనే మా కుటుంబానికి ఆధారం. ఆస్పత్రిలో చేరి నెలకావొస్తున్నా కనీసం వచ్చి చూసింది లేదు. వెలిగండ్ల పోలీసులు కూడా నేనే మా ఆయన్ను కొట్టానని అంటున్నారట. ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్‌ చేయలేదు. ఇక నా ఆపరేషన్‌ విషయంలో అబార్షన్‌ జరిగితే మా బాధ్యతని, నేను, మా అమ్మ ఇద్దరం అంగీకరించాం. మా అత్తతో కూడా సంతకం తీసుకున్నారు. నా భర్త ఆచూకీ గురించి అడిగితే అత్త కూడా చెప్పడం లేదు.  -దుగ్గినపల్లిపరిశుద్ధమ్మ

మరిన్ని వార్తలు