భర్త ఉన్మాదం.. భార్యపై కత్తివేట్లు

20 Oct, 2018 02:28 IST|Sakshi
నిందితుడు రెహమాన్, చికిత్స పొందుతున్న బాధితురాలు కౌసర్‌బేగం

బేగంపేట పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలోనే ఘటన 

భార్య, అత్త, వదిన, అడ్డువచ్చిన మరో ఇద్దరిపైనా దాడి 

హైదరాబాద్‌: కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యపై కక్షపెంచుకున్న ఓ వ్యక్తి ఆమెపైనా, ఆమె పుట్టింటి బంధువులపైనా విచక్షణారహితంగా కత్తితో దాడిచేశాడు. బేగంపేట పోలీసు స్టేషను ఆవరణలోనే గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన నగరాన్ని నివ్వెరపరచింది. ఇటీవల జరిగిన అత్తాపూర్, ఎర్రగడ్డ కత్తి దాడి సంఘటనలు మరువక ముందే సాక్షాత్తూ పోలీసుల ఎదుటే జరిగిన ఈ ఉదంతం పలువురిని విస్మయ పరుస్తోంది.

ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉన్మాదిలా మారిన నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు..బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగెనవర్‌ తెలిపిన వివరాల మేరకు ఆల్వాల్‌ యాప్రాల్‌ సమీప బాలాజీనగర్‌కు చెందిన సయ్యద్‌ రెహమాన్‌ పెయింటర్‌. బేగంపేట రసూల్‌పురాకు చెందిన కౌసర్‌బేగంను ప్రేమించిన రెహమాన్, 2009లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా మద్యానికి బానిసైన అతను తన భార్యను వేధిస్తున్నాడు. దీంతో ఆమె గత నాలుగైదు నెలల క్రితం పుట్టింటికి చేరింది.  

ఈ నేపథ్యంలోనే కౌసర్‌బేగం పనిచేసే పాటిగడ్డలోని రాక్‌స్టార్‌ బట్టల గోదాం వద్దకు గురువారం ఉదయం వెళ్లిన రెహమాన్‌ ఆమెతో డబ్బులు కావాలని గొడవ పడ్డాడు. తర్వాత బాధితురాలు తల్లి సర్దార్‌బేగం, అక్క షాకీర్‌బేగంలతో కలసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.  అక్కడ షాకీర్‌బేగం కుమార్తె మస్తానాబేగం, కౌసర్‌బేగం మరో సోదరి కుమారుడు సల్మాన్‌ఖాన్‌ కోసం స్టేషన్‌ బయట వారు వేచి చూస్తుండగా  రెహమాన్‌ అక్కడికి చేరుకున్నాడు.  కౌసర్‌బేగం, వారి కుటుంబీకులు కనిపించడంతో వారిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కౌసర్‌బేగంతో పాటు ఆమె తల్లి , అక్క , మస్తానాబేగం, సల్మాన్‌ఖాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. 

అడ్డుకున్న పోలీసుల పైకి సైతం కత్తి ఎత్తి... 
దసరా పండుగ కావడంతో గురువారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో పూర్తిస్థాయి సిబ్బంది లేరు. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్‌ బుచ్చయ్యతో పాటు ఇద్దరు ఎస్‌ఐలు, నలుగురైదుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు.వారు రెహమాన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిపైకీ నిందితుడు కత్తి ఎత్తాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయలో పోలీసు సిబ్బందిపై కూడా రక్తం చిందింది. పోలీస్‌స్టేషన్‌ ఆవరణ రక్తపు మడుగులా మారింది. అయితే తర్వాత పోలీసులు రక్తాన్ని నీటితో శుభ్రపరిచేశారు.  

గాంధీకి తరలింపు...ఒకరి పరిస్థితి విషమం.. 
ఈ దాడిలో చేతులు, భుజాలు, కాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో కుప్పకూలిన కౌసర్‌బేగం, ఆమె బంధువులను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.వీరికి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది. వీరిలో ఒక్క మస్తానాబేగం పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో కిమ్స్‌కు తరలించారు. నిందితుడిని రిమాండ్‌కు పంపనున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ బుచ్చయ్య తెలిపారు. 

రెండేళ్ల కిందటే కేసు...రాజీ... 
కౌసర్‌బేగం రెండేళ్ల క్రితమే తనను రక్షించాలని బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. వారు బేగం పేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు ఆమెను పంపడంతో 2016 జూలై 20న అక్కడ పిర్యాదు చేసింది.దీంతో మహిళా పోలీసులు కౌన్సెలింగ్‌ నిమిత్తం సీసీఎస్‌కు పంపించారు. అది పూర్తయిన రెండు నెలలకు సెప్టెంబర్‌ 27న తామిద్దరం బాగానే ఉంటున్నామని, కేసును ఉపసంహరించుకుంటున్నట్లు కౌసర్‌బేగం పోలీసులకు తెలిపింది. వారిద్దరూ రాజీకి రావడంతో పోలీసులు కూడా కేసును కొట్టివేశారు.

>
మరిన్ని వార్తలు