భార్య మీద కోపంతో అత్తింటివారిపై దాడి

23 Nov, 2019 03:37 IST|Sakshi

మంటల్లో చిక్కుకొని భార్య సహా ఐదుగురికి తీవ్ర గాయాలు

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో ఘటన

కొండపాక (గజ్వేల్‌): భార్యమీద కోపంతో ఓ వ్యక్తి అత్తింటి వారిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులపై మండే స్వభావం ఉన్న టిన్నర్‌ను చల్లి టపాకాయలతో అగ్గి రాజేశాడు. దీంతో మంటలు చెలరేగి భార్య, బావమరిది కుటుంబీకులు, వదినతో కలిపి ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని నెమలికొండకు చెందిన చిలుముల లక్ష్మీరాజం (42)కు సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రాజమల్లి రామవ్వ–రామయ్య రెండో కూతురు విమల (35)తో 2007లో వివాహం జరిగింది. లక్ష్మీరాజం కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. దంపతుల మధ్య గొడవల కారణంగా పదేళ్లనుంచి ఎవరికి వారు వేర్వేరుగా ఉంటున్నారు. భార్యపై కక్ష పెంచుకున్న లక్ష్మీరాజం ఎలాగైనా భార్య విమలతోపాటు పిల్లలను, అత్తింటివారిని హతమార్చాలని పథకం వేశాడు.

దీంతో అత్తగారి ఊరైన ఖమ్మంపల్లికి వెళ్లి ఇంట్లో నిద్రలో ఉన్న భార్య విమల, కూతురు పవిత్ర, బావమరిది జాన్‌రాజ్, అతని భార్య రాజేశ్వరి, లక్ష్మీరాజంకు వదిన వరుస అయ్యే సుజాతలపై తలుపు సందులోంచి టిన్నర్‌ను పోశాడు. తర్వాత దీపావళికి కాల్చే సుతిలి బాంబులను గదిలోకి వేశాడు. మంటలు అంటుకుని తీవ్ర గాయాల పాలైన ఆ ఐదుగురు బాధ తాళలేక గదిలోంచి బయటకు వచ్చి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు మేల్కొని వెంటనే గాయాలైన ఆ ఐదుగురిని సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షత గాత్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విమల, జాన్‌రాజ్, సుజాతల పరిస్థితి విషమంగా ఉంది. లక్ష్మీరాజంను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా