అనుమానంతో అంతం చేశాడు 

23 Feb, 2019 07:20 IST|Sakshi
రోజా మృతదేహం

మధిర: ఆలుమగల మధ్య అనుమానపు బీజం పడకూడదు. ఒక్కసారి పడిందంటే... మొలకెత్తుతుంది, మానువుగా మారుతుంది. అల్లకల్లోలం సృష్టిస్తుంది. అంతం చేస్తుంది. మధిర మండలం జిలుగుమాడ గ్రామంలో ఇదే జరిగింది. కృష్ణా జిల్లా గంపలగూడెం గ్రామస్తుడు కోట రాజుకు, జిలుగుమాడు గ్రామస్తురాలు  వెంగళ రోజాతో 2010లో వివాహమైంది. పెళ్లి తరువాత రెండేళ్లపాటు గంపలగూడెంలోనే ఉన్నారు. ఆ తరువాత జిలుగుమాడు వచ్చారు. రోజా తల్లి వెంగళ వెంకటమ్మ ఇంట్లో ఉంటున్నారు. రాజు–రోజా దంపతులకు ఐదేళ్ల కూతురు ప్రవళిక ఉంది. పెళ్లయినప్పటి నుంచి రోజాను రాజు అనుమానిస్తున్నాడు. వారు తరచుగా గొడవ పడుతున్నారు.

సుమారు పది రోజుల క్రితం, వెంకటమ్మ ఇంటి సమీపంలోనే మరో అద్దె ఇంటిలోకి ఆ దంపతులు మకాం మార్చారు. భోజనం మాత్రం వెంకటమ్మ ఇంట్లోనే చేస్తున్నారు. గురువారం రాత్రి కూడా భోజనానికి వచ్చారు. అక్కడ, ఎవరితోనో సెల్‌ ఫోన్‌లో రోజా మాట్లాడుతుండడాన్ని రాజు గమనించాడు. ఆమెను అనుమానించాడు. కోపంతో బయటకు వెళ్లాడు. వారి కుమార్తె ప్రవళిక మాత్రం అమ్మమ్మ వెంకటమ్మ ఇంట్లోనే నిద్రపోయింది. కొద్దిసేపటి తరువాత, రోజా తమ అద్దె ఇంటికి వెళ్లింది. శుక్రవారం ఉదయాన్నే ప్రవళిక, తమ ఇంటికి వెళ్లింది. మంచంపై తల్లి పడుకుని ఉంది.

తండ్రి కనిపించలేదు. తల్లిని ఎంత లేపినా లేవలేదు. ఏడ్చుకుంటూ అమ్మమ్మ వెంకటమ్మ వద్దకు వెళ్లి చెప్పింది. ఆమె రోజా వద్దకు పరుగున వెళ్లింది. ఆమె శరీరంపై గాయాలున్నాయి. స్పృహలో లేదు. ఇంతలో చుట్టపక్కల వారు వచ్చారు. ఆమెను పరిశీలించారు. ఊపి ఆడడం లేదు, గుండె కొట్టుకోవడం లేదు. ప్రాణం పోయినట్టుగా నిర్థారించారు. వెంకటమ్మ పెద్ద పెట్టున రోదించింది. ‘‘నా బిడ్డను అల్లుడు అనుమానించాడు. ఆమెతో గొడవపడి, గొంతు నులిమి, పదునైన ఆయుధంతో పొడిచి చంపి పరారయ్యాడు’’ అని, మధిర టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదైంది. టౌన్‌ ఎస్‌ఐ చంద్రమోహన్‌ దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు