అంతుచూసిన అనుమానం

21 Apr, 2019 13:06 IST|Sakshi

అనుమానం కత్తి దూసింది.. కట్టుకున్న భార్యనే కడతేర్చేందుకు తెగిం చింది. ముగ్గురు పిల్లలను అనాథలను చేసింది. గోపాలపట్నం సమీ పంలోని కొత్తపాలేనికి చెందిన పైడిరాజు పదేళ్లుగా కాపురం చేస్తున్న తన భార్య శారదపై అనుమానం పెం చుకున్నాడు.. పైగా తాగుడుకు బానిసై తరచూ వేధించేవాడు. వీటిని భరించలేని ఆమె తన ముగ్గురుపిల్లలతో  ధర్మానగర్‌లోని పుట్టింటికి వెళ్లిపోయి.. ఓ షాపింగ్‌ మాల్‌ పనిచేస్తూ జీవిస్తోంది. ఒకవైపుఅనుమానం.. మరో వైపు భార్య పుట్టింటికి వెళ్లిపోవడం పైడిరాజులో మరింత కక్ష పెం చాయి. కలిసి ఉందామని మాయమాటలు చెప్పి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రివేళ ఆమె నిద్రిస్తున్న సమయంలో దాడి చేసి పాశవికంగా కత్తితో మెడ ముందు, వెనుక భాగాల్లో  పొడవడంతో శారద మరణించింది. ఆ వెంటనే నిందితుడు పోలీస్‌స్టేషన్‌కువెళ్లిలొంగిపోయాడు.

ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ పశ్చిమ): అనుమానం పెనుభూతమైంది. ఓ కుటుబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఆనందంగా జీవించాల్సిన పిల్లలను ఒక్కసారిగా అనాథులను చేసేసింది. గోపాలపట్నం ప్రాంతం కొత్తపాలెం పరిధి నాగేంద్రనగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఓ భర్త భార్యను అతి కిరాతకంగా చంపేశాడు.  భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య మెడను కర్కశంగా కత్తితో కోసి చంపేశాడు. గోపాలపట్నం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎద్దు పైడిరాజుతో మేనత్త కుమార్తె శారద(25)కు 10 ఏళ్ల క్రితం వివాహమయింది. పైడిరాజు స్థానికంగా తలయారీగా పని చేస్తున్నాడు. వీరి సంసారం సంతోషంగా సాగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, కుమార్తె. ఆనందంగా సాగుతున్న వీరి దాంపత్యంలో అనుమాన బీజం అశాంతిని రేపింది. తరచూ భార్యభర్తలు గొడవలు పడేవారు. పైడిరాజు తాగి వచ్చి తరచూ భార్యను కొట్టడం.. హింసించడం చేస్తుండేవాడు.

ఆ బాధలు పడలేక శారద కొన్ని నెలల క్రితం కంచరపాలెం సమీప ధర్మానగర్‌లో తల్లి వద్దకు వెళ్లిపోయింది. తల్లికి భారం కాకూడదని నగరంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. రెండు రోజుల క్రితం నేను బాగా చూసుకుంటాను అని నమ్మబలి భర్త పైడిరాజు ఆమెను ఇంటికీ తీసుకుని వచ్చాడు. శుక్రవారం అర్ధరాత్రి నిద్రించే సమయంలో మంచంపై పడుకున్న శారదపై భర్త దాడి చేశాడు. మెడ వెనుకభాగంలో దాడికి యత్నించగా, గమనించి ఆమె తిరిగే సరికి మరో మారు దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆమె చేతికి గాయాలయ్యాయి.

రాక్షసుడి బలం ముందు ఆమె తాళలేకపోయింది. పైడిరాజు..శారద గొంతు వద్ద కత్తితో కిరాతకంగా కోయడంతో ఆమె మృత్యువాత పడింది. హత్య చేసిన అనంతరం పైడిరాజు గోపాలపట్నం పోలీసులకు లొంగిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి డీసీపీ నయీమ్‌ హస్మి, ఏసీపీ దేవ ప్రసాద్, సీఐ రమణయ్య, ఎస్‌ఐ రఘురామ్‌ వచ్చి వివరాలు సేకరించారు. క్లూస్‌ టీం ఆధారాలను సేకరించింది. పైడిరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాగుబోతు మాటలు నమ్మి వెళ్లిపోయింది..తనువు చాలించిందంటూ తల్లి భోరున విలపిస్తోంది. పిల్లల భవిష్యత్తు ఏమిటని వాపోయింది. ఇది చూసిన వారు కంటతడి పెట్టారు.

నమ్మకంగా తీసుకొచ్చి.. 
భర్త మారాడు...చక్కగా చూసుకుంటాడు అని నమ్మకంతో శారద భర్తతో పాటు రెండు రోజుల క్రితం నాగేంద్రనగర్‌కు వచ్చింది. అయితే పైడిరాజు మాత్రం మనసులో ద్వేషాన్ని నింపుకొని ఇంటికి తీసుకొచ్చాడు. అయాయకంగా నమ్మి వచ్చిన శారద ఒక రోజు మాత్రమే ఇక్కడ గడిపింది. రెండో రోజు అర్ధరాత్రి భర్త రాక్షసుడిగా మారి ఆమెను ప్రాణాలు తీసేశాడు.

మరిన్ని వార్తలు