పతియే ప్రత్యక్ష ద్రోహి.!

31 May, 2018 13:07 IST|Sakshi
నిరాశ్రయుల ఆశ్రమంలో తల దాచుకొంటున్న నాగలక్ష్మి

అసలే పేదరికం.. నా అన్నవారెవ్వరూ లేరు.. బంధువుల మాటలు నమ్మి ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్నేళ్లు సంసారం సజావుగా సాగినా.. ఆ తర్వాత కట్టుకున్నోడు కర్కోటకుడయ్యాడు.. ఆమెను కువైట్‌కు పంపి.. ఆమె సంపాదన మొత్తం కాజేసి చివరకు కాలదన్నాడు.. ఏ దిక్కులేని దుస్థితిలో ఆమె రాయచోటిలోని నిరాశ్రయుల ఆశ్రమంలో తలదాచుకుంటోంది. దగాపడ్డ అభాగ్యురాలి దయనీయ గాథ ఆమె మాటల్లోనే...

రాయచోటి టౌన్‌ : ‘నా పేరు ఇర్ల నాగలక్ష్మి.. మాది నల్గొండ జిల్లా.. పేద కుటుంబం. మా బంధువుల సూచన మేరకు చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వ్యక్తిని పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. మూడేళ్లు కలిసి బాగున్నాము. మాకు పిల్లలు పుట్టలేదు. మా భర్త బాగా చదువుకున్నాడు. ఎస్‌ఐ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని.. లా చేస్తున్నానని చెప్పాడు. ఎన్ని కష్టాలెదురైనా ఇద్దరం కలిసే ఎదుర్కొనేవాళ్లం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకో నన్ను కువైట్‌కు పంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. వెంటనే పాస్‌పోర్టు తయారు చేసి ఏడేళ్ల క్రితం కువైట్‌కు పంపాడు. అక్కడికి వెళ్లిన తరువాత క్రమం తప్పకుండా ఫోన్లు చేసేదానిని. నెల నెలా జీతం డబ్బులు పంపాను. డబ్బులు పంపినప్పుడల్లా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నానని లక్షలు లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం వచ్చిందా అంటే ఆ ప్రయత్నంలోనే ఉన్నానని.. ఉద్యోగం రాగానే నీకు ఫోన్‌ చేస్తానని చెప్పడంతో ఎంత కష్టం అయినా సరే భరిస్తానని చెప్పి అక్కడే ఉండి పని చేశాను. వచ్చిన డబ్బులు వచ్చినట్లే పంపించాను. ఐదేళ్లు పూర్తయిన తరువాత వేరేవారి ద్వారా ఒక పచ్చి నిజం తెలిసింది. ఆయన మరో పెళ్లి చేసుకున్నాడని ఉద్యోగం రావడంతో బెంగళూరులో  స్థిరపడ్డాడని తెలిసింది.

విషయం తెలిసి అతన్ని నిలదీయగా నిజం ఒప్పుకున్నాడు. ఇలా నాకు అన్యాయం చేయడం నీకు తగునా అని ప్రశ్నిస్తే.. అదేంటి.. నీవు కూడా ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకోపో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు.  ఆ తరువాత ఫోన్‌ చేసినా మాట్లాడే వాడు కాదు.  మళ్లీ మళ్లీ ఫోన్‌ చేయగా ఒకసారి హైదరాబాద్‌కు వచ్చేయమన్నాడు. అయితే అక్కడ కూడా తాను భర్త అని చెప్పవద్దని .. తెలిసిన వ్యక్తి అని చెప్పాలన్నాడు. అక్కడ ఓ ధనవంతుల ఇంటిలో పనికి కుదిరిస్తానని.... అక్కడే ఆ ఇంటిలోనే  ఉండి వారికి సేవలు చేసుకోవాలని చెప్పాడు. అవసరం అయితే నీవు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తానన్నాడు. ఆయన మాటలు విన్న తరువాత కడుపు మండి కువైట్‌ నుంచి నేరుగా తిరుపతికి వెళ్లాను. అక్కడ మా అత్తింటి వారు నన్ను చీదరించుకున్నారు. ఇంటిలోకి రానీయలేదు... ఇక పుట్టింటికి వెళదామంటే నాకంటూ ఎవరూ లేరు.

ఎటు పోవాలో తెలియక నాకు కువైట్‌లో పరిచయం ఉన్న స్నేహితురాలు రాయచోటిలో ఉందని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఆమె నిరాశ్రయుల ఆశ్రమ కేర్‌ టేకర్‌గా పని చేస్తోంది. జరిగిన విషయం ఆమెకు చెప్పాను. ఆమె కూడా ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడింది. నాగలక్ష్మి ఎవరో తనకు తెలియదని చెప్పాడు.  ఇక చేసేది లేక నెల రోజుల నుంచి ‘‘నిరాశ్రయుల’’ ఆశ్రమంలో తలదాచుకొంటున్నాను’.. అని ఆమె తన కన్నీటి గాథను వివరించింది. మానవతావాదులు.. స్వచ్ఛంద సంస్థల వారు స్పందించి ఆమెకు మద్దతుగా న్యాయ పోరాటం చేసి మోసగాడికి శిక్ష పడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు