సతీ వియోగం భరించలేక..

30 Jan, 2019 13:29 IST|Sakshi
ప్రశాంతి (ఫైల్‌)నాగమురళీకృష్ణ (ఫైల్‌)

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

అనారోగ్యానికి గురైన అర్ధాంగికి అన్నీ తానై సపర్యలు

సహచరి లేని లోకంలో ఉండలేనని అఘాయిత్యం

రామవరప్పాడులో చోటు చేసుకున్న ఘటన

వారికి పెళ్లయి దశాబ్దంన్నర అయ్యింది. ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు. సంతానం లేకపోయినా అన్యోన్యంగా ఉంటూ పలువురి మన్ననలు చూరగొన్నారు. ఆమె తనకన్నా వయస్సులో ఐదేళ్లు పెద్దదైనా కళ్లల్లో పెట్టుకుని చూసుకునేవాడు. జీవితం సాఫీగా సాగుతోందనుకున్న సమయంలో విధి వక్రించింది. భార్య అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెకు అన్నీ తానై సేవలందించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్ర అనారోగ్యానికి గురై భార్య కన్నుమూసింది. ఆమె లేని ఈ లోకంలో తాను మాత్రం ఎందుకంటూ తీవ్ర  మనస్తాపానికి గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో చోటు చేసుకుంది.

అమరావతి, రామవరప్పాడు (గన్నవరం): రామవరప్పాడు గోళికృష్ణయ్య వీధిలో గొట్టిపాటి నాగమురళీకృష్ణ (45) ప్రశాంతి (50) దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రశాంతి తల్లితండ్రులు కృష్ణలంకలో ఉంటారు. మురళీకృష్ణ తల్లిదండ్రులు మచిలీపట్నంలో ఉంటున్నారు. వీరికి వివాహం అయిన తర్వాత గ్రామంలోనే ఉంటున్న ప్రశాంతి అక్కకు చెందిన భవనంలోని ఓ పోర్షన్‌లో కాపురం పెట్టారు. మురళీకృష్ణ మహానాడు రోడ్డులోని ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాంతి కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురైంది. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీంతో అప్పటి నుంచి భార్యను కంటికిరెప్పలా చూసుకుంటూ సేవలందించాడు. ఉద్యోగానికి వెళ్తూనే భార్యకు అన్ని సమకూర్చేవాడు.

కాలక్రమేణా వ్యాధి ముదిరి లివర్‌కు సోకింది. దీంతో నిత్యం ఏసీ గదిలోనే భార్యను ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లి ప్రశాంతి అనుకోకుండా మూడుసార్లు కింద పడిపోయింది. దీంతో ఆమెను తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ప్రశాంతి మంచంపైనే తుది శ్వాస విడిచింది. ఇది గమనించిన భర్త తీవ్ర మనోవేధనకు గురై హాల్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 11 గంటలు దాటినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి పక్క పోర్షన్‌ నివాసితులు తలుపులు బద్దలు కొట్టి చూడగా భార్యాభర్తలు విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో పటమట పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ అంకినేని ప్రసాద్, పటమట ఎస్‌ఐ సత్యసుధాకర్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మురళీకృష్ణ మృతదేహం వద్ద లభ్యమైన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనపరుకున్నారు. బంధువులు, స్నేహితులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అన్యోన్యతకు మారుపేరుగా...
మురళీకృష్ణ, ప్రశాంతి ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారి మధ్య ఒక్క చిన్న గొడవ కూడా జరిగిన దాఖలాలు లేవని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. మురళీకృష్ణ చలాకీగా అందరిని నవ్విస్తూ ఉండేవాడని సన్నిహితులు, తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతరమయ్యారు. ఇంట్లో భార్య ఒంరిగా ఉంటుందని, సమయానికి ఇంటికి వచ్చేసి ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేవాడని చెబుతున్నారు. భార్య అనారోగ్యానికి గురైన నాటి నుంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లడం, సమయానికి మందులు ఇవ్వడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం వంటివి చేసేవాడని పక్క నివాసితులు తెలిపారు. వీరి మృతదేహాలను చూసిన చుట్టుపక్కల వాళ్లు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

భార్యలేని జీవితాన్ని ఊహించుకోలేకే...
భార్యలేని జీవితాన్ని ఊహించుకోలేకే తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు మురళీకృష్ణ సూసైడ్‌ నోట్‌లో వివరించాడు. కొన్ని మాసాలుగా ప్రశాంతికి ఆరోగ్యం బాగోవడం లేదని, ఆమెను కాపాడుకోవడానికి ఎంతగానో శ్రమపడ్డానని రాశాడు. బ్యాంక్‌లో కుదవ పెట్టిన బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల వివరాలను కూడా సూసైడ్‌ నోట్‌లో వివరంగా రాశాడు.

మరిన్ని వార్తలు