చెడు నడవడి.. చేతులు తెగిపడి

31 Oct, 2019 12:47 IST|Sakshi
రెండు చేతులు తెగి చికిత్స పొందుతున్న పద్మావతి

ప్రాణం మీదకు తెచ్చిన వివాహేతర సంబంధం  

భర్త మాటలను పెడచెవిన పెట్టిన భార్య

రెండు చేతులను నరికి పారిపోయిన వైనం

కేసు నమోదు చేసిన పోలీసులు

ఎంతో శాంతంగా ఉండే శివయ్యకు భార్య ప్రవర్తన కోపం తెప్పించింది. సమాజంలో తలవంపులు తెచ్చే నడవడికను మార్చుకోవాలని చెప్పి చూశాడు. పెద్దలు, తల్లిదండ్రులు చెప్పినా ఆమెలో మార్పురాలేదు. శివయ్య శివాలెత్తిపోయి భార్య రెండు చేతులు నరికాడు.ప్రాణాపాయస్థితిలో ఆమె తిరుపతిలో చికిత్స పొందుతోంది.   

వైఎస్‌ఆర్‌ జిల్లా, రైల్వేకోడూరు రూరల్‌ : వివాహేతర సంబంధం వద్దని పలుమార్లు హెచ్చరించినా వినని భార్యపై భర్త కత్తితో దాడి చేసి రెండు చేతులు నరికాడు.ఈ సంఘటన రైల్వేకోడూరు మండలంలోని లక్ష్మీగార్డెన్స్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  మండలంలోని వీపీఆర్‌ కండ్రిక పంచాయతీ లక్ష్మీగార్డెన్స్‌ (ఎస్టీ కాలనీలో)లో నివాసం ఉంటున్న సౌడవరం శివయ్యకు కడపలోని ఓ ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న పద్మావతితో వివాహమైంది. నాలుగు సంవత్సరాల వారి కాపురంలో పలుమార్లు గొడవలు అయ్యాయి. ఆమె మరొక వ్యక్తితో వివాహేతర సంబంధంతో పది రోజులకు ఒక సారి ఇంటి నుంచి వెళ్లిపోయేది. తర్వాత వచ్చి భర్త దగ్గర ఉండేది.

ఈ విషయంపై ఆరా తీసిన శివయ్య భార్య ప్రవర్తన మార్చుకోవాలని చెప్పాడు. అయినా ఆమె వినలేదు. తర్వాత గ్రామంలోని పెద్దలు కూడా జోక్యం చేసుకుని ఇరువురికి సర్దిచెప్పి కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. తర్వాత  ఆమె తల్లిదండ్రులు కూడా చెప్పి చూసినా వినలేదు. ఈ క్రమంలో గత వారం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి ఇంట్లో బట్టలను సర్దుకుంది. అంతలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆ రాత్రి 11 గంటల సమయంలో శివయ్య గట్టిగా అరుస్తూ పద్మాను కత్తితో నరికి చంపాను వెళ్లి చూసుకోండని చెప్పి పారిపోయాడు. గ్రామస్తులు వెతుక్కుంటూ వెళ్లగా శ్మశానం వద్ద రక్తపుమడుగులో ఆమె కన్పించింది. స్థానికులు దేశెట్టిపల్లెలోని వైఎస్సార్‌ సీపీ నాయకుడు ప్రసాద్‌రెడ్డికి సమాచారం అందించారు ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని పోలీసులకు తెలిపారు. తెగిపడిన కుడి చేయి దూరంగా చెట్ల మధ్యలో నుంచి వెతికి తెచ్చారు. ఎస్‌ఐ నరసింహం బాధితురాలిని 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. 

ఇదిలా ఉండగా శివయ్యకు గతంలో వివాహమైంది. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐదవ కాన్పులో ప్రసవ వేదనతో 2014లో భార్య కమల మృతి చెందింది. ఒకటిన్నర సంవత్సరం పాటు పిల్లలను చూసుకుంటున్న శివయ్య ఒక చోట జరిగిన కార్యక్రమంలో పరిచయమైన పద్మావతిని వివాహం చేసుకున్నాడు. పద్మావతి కూడా గతంలో ఒకరిని వివాహం చేసుకొని భర్తకు దూరంగా ఉండేది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా