విడ'తీయని'బంధం!

20 Jan, 2020 07:41 IST|Sakshi
లోకనారాయణన్, రాజేశ్వరి (ఫైల్‌)

భార్య మృతిని తట్టుకోలేక

గుండెపోటుతో భర్త మృతి

సంజీవిరాయన్‌ కోవిల్‌ వీధిలో విషాదం

50 ఏళ్ల వైవాహిక జీవితంఒడిదొడుకుల ప్రయాణంచలించని మనోధైర్యంప్రేమానురాగాలు అనంతంఆగెను ఓ హృదయంవిలవిల్లాడెను మరో ప్రాణంఆ హృదయాన్నే అనుసరించిన వైనంఓడి గెలిచిన మూడుముళ్ల బంధం

చెన్నై,టీ.నగర్‌: నిద్రలో భార్య ప్రాణాలు కోల్పోవడంతో దిగ్భ్రాంతికి గురైన భర్త గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం విషాదాన్ని నింపింది. వివరాలు.. చెన్నై వాషర్‌మెన్‌పేట సంజీవిరాయన్‌కోవిల్‌ వీధికి చెందిన లోకనారాయణన్‌ (65) చెన్నై కార్పొరేషన్‌ రిప్పన్‌ బిల్డింగ్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఇతని భార్య రాజేశ్వరి (60). వీరికి పెళ్లై దాదాపు 50 ఏళ్లు అవుతోంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కావడంతో విడిగా ఉంటోంది. గత 14వ తేదీన తీవ్రమైన గుండెనొప్పితో బాధపడిన రాజేశ్వరిని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ ఆమె చికిత్సలు ముగించుకుని ఇంటికి చేరుకుంది. శనివారం ఉదయం కాఫీ తయారుచేసేందుకు రాజేశ్వరిని లేపగా ఆమె నిద్రలోనే మృతిచెందినట్లు తెలిసింది. దిగ్భ్రాంతి చెందిన లోకనారాయణన్‌ స్ఫ్రహతప్పి పడిపోయాడు. కొంతసేపటికే భార్య మృతదేహం వద్దే కన్నుమూశాడు. ఆదివారం దంపతులు ఇంటి నుంచి వెలుపలికి రాకపోవడంతో అనుమానించిన ఇరుగుపొరుగు వారి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇరువురూ మృతిచెంది ఉండడం చూసి నివ్వెరపోయారు. దీనిపై సమాచారం అందుకున్న వారి బంధువులు ఇంటికి చేరుకున్నారు. కుమారుడు జగదీశన్, కుటుంబీకుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. తండయార్‌పేట పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. 

మరిన్ని వార్తలు