పెళ్లయిన మొదటి రోజే గెంటేశారని..

6 Apr, 2019 10:20 IST|Sakshi
భర్త ఇంటి ఎదుట కూర్చున్న రజిత

మంచిర్యాలక్రైం: వివాహమైన మొదటి రోజే భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు ఓ ప్రభుద్దుడు. ఇది జరిగి మూడు సంవత్సరాలైనా సదరు యువతికి న్యాయం జరగలేదు. పోలీసు స్టేషన్‌ మెట్లెక్కినా ఫలితం దక్కలేదు. ఎక్కడ న్యాయం జరగకపోవడంతో హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించింది. చివరికి మంచిర్యాల పట్టణంలోని గౌతమినగర్‌లో భర్త ఇంటి ఎదుట న్యాయ పోరాటానికి దిగిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

బాధితురాలి కథనం ప్రకారం... బెల్లంపల్లికి చెందిన దుర్గం దుర్గయ్య, లక్ష్మి కూతురు రజితను ఆసిఫాబాద్‌ జిల్లా జన్కపూర్‌కు చెందిన చెందిన చంద్రి రామయ్య, నందబాయిల కుమారుడు మోనుతో 2016 ఏప్రిల్‌ 22న కుంటుంబ పెద్దల సమక్షంలో వివాహం చేశారు. వివాహం సమయంలో రూ.9లక్షలు, 5 తులాల బంగారం ఇచ్చారు. వివాహమైన మొదటి రోజే భర్త మోను రజితను వదిలేసి పారిపోయాడు.

దీంతో మోను తల్లి దండ్రులు రజితను తీసుకుని మంచిర్యాలలోని  ఉన్న ఇంటికి తీసుకువచ్చారు. ఉదయం రజిత అత్తమామలు సైతం రజితను ఇంట్లో వదిలేసి వెళ్లిపోయారు. సాయంత్రం రజిత భర్త మోను, అత్తమామలు వచ్చి అదనంగా రూ.5లక్షల కట్నం తేవాలని, మా వదిన శివరంజిని చెప్పినట్లు చేయాలి అంటూ ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ సైతం పలుమార్లు నిర్వహించారు. రజితను వదిలేస్తానని వివాహ సమయంలో తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇచ్చేస్తానని పెద్దల సమక్షంలో మెనూ ఒప్పంద పత్రాలు సైతం రాసిచ్చారు.

ఒప్పందం ప్రకారం కట్నం డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు బెల్లంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో 2017లో వరకట్నం, వేధింపుల కేసు నమోదైంది. పలుమార్లు బెల్లంపెల్లి పోలీస్‌స్టేషన్‌ వెళ్లినా న్యాయం జరుగక పోవడంతో చేసేది లేక భర్త ఇంటి ఎదుట న్యాయ పోరాటానికి దిగినట్లు రజిత తెలిపింది. న్యాయ పోరాటానాకి జాతీయ మనవ హక్కుల పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సహేరబాను, సభ్యులు మద్దతు ప్రకటించారు.

మరిన్ని వార్తలు