గంగాధర్‌ ఎక్కడ?

26 Jul, 2018 13:08 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన వాణి (పాతచిత్రం) ,పరారీలో ఉన్న వాణి భర్త గంగాధర్‌

వాణి ఆత్మహత్య కేసు విచారణలో జాప్యం

విశాఖపట్నం, పెదవాల్తేరు: చినవాల్తేరు దరి కిర్లంపూడి లేఅవుట్‌కు చెందిన పసుపులేటి వాణి (35) ఆత్మహత్య కేసుకు సంబంధించి మూడో పట్టణ పోలీసుల దర్యాప్తు నత్తను తలపిస్తోంది. ఈ కేసులో నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. గత నెల 14న అత్తింటివారి వేధింపులు భరించలేక కిర్లంపూడి లేఅవుట్‌లోని అపార్ట్‌మెంట్‌లో వాణి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వాణి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె భర్త గంగాధర్, అత్త రాజేశ్వరి, బావ సతీష్‌ల కోసం మూడో పట్టణ ఎస్‌ఐ ప్రసాద్, కానిస్టేబుల్‌ గుంటూరు, తెనాలి పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. వీరు జిల్లా పరిషత్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. అక్కడ కూడా వీరి జాడ దొరకలేదు.

ఆమె ఆత్మహత్య జరిగి నెల రోజులు దాటిపోయినా పోలీసులు నిందితులను పట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, నిందితుల ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నాయని ఎస్‌ఐ ప్రసాద్‌ చెబుతున్నారు. కుమార్తె చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వాణి తల్లిదండ్రులు.. నిందితులు పోలీసులకు దొరక్కపోవడంతో కుమిలిపోతున్నారు. వాణి భర్త గంగాధర్‌ మెడికల్‌ ఏజెన్సీస్‌ వ్యాపారం కొనసాగిస్తున్నట్టు సమాచారం. కాగా, గంగాధర్‌ తన సోదరుడు సతీష్‌తో కలిసి నగరంలోని ఓ హోటల్‌లో మకాం వేశాడని వాణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  

నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు
వాణి ఆత్మహత్య కేసుకు సంబంధించి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం. సతీష్‌ భార్య డాక్టర్‌ కవితాలక్ష్మిని విచారించినా.. అతను ఎక్కడున్నారో తెలియదని చెప్పారు. నిందితుల ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నాయి. – టి.ఇమ్మానియేల్‌రాజు, సీఐ, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌

మరిన్ని వార్తలు