కుటుంబ కలహాలతో భార్యపై కాల్పులు

23 Jun, 2018 07:47 IST|Sakshi
సహానా (ఫైల్‌ ఫొటో)

ఇద్దరు పిల్లలపై కూడా

అక్కడికక్కడే మృతి చెందిన భార్య సహానా

హెర్బల్‌ ఉడ్‌ ఫామ్‌ హౌస్‌ యజమాని కిరాతకం

చావుబతుకుల మధ్య చిన్నారులు

జయనగర : కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసి పిల్లలతో కలిసి పారిపోతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గణేశ్‌ను జయనగర పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేపడుతున్నారు. వివరాలు...హసన్‌జిల్లా సకలేశపుర నివాసి గణేశ్‌ పారిశ్రామికవేత్త. సకలేశపురలో ఉన్న కాఫీ తోటలు విక్రయించి వచ్చిన నగదుతో బెంగళూరు నగరానికి చేరుకున్న గణేశ్‌ కనపురరోడ్డులోని నెట్టిగెరెలో హెర్బల్‌ ఉడ్‌ ఫామ్‌హౌస్‌ పేరుతో రిసార్టు నిర్వహిస్తూ జయనగరలో నివాసముంటున్నారు. ఇతని భార్య సహానాతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఇద్దరు కుమారుల్లో ఒకరు మానసిక వికలాంగుడు. గత రెండేళ్లుగా హెర్బల్‌ ఉడ్‌ ఫామ్‌ హౌస్‌లో నష్టాల్లో కూరుకుపోవడంతో గణేశ్‌ ప్రైవేటుగా రూ. లక్షలు అప్పులు చేశాడు.

ఇటీవల రుణదాతల వేధింపులు అధికం కావడంతో రిసార్టు విక్రయించే విషయంలో గణేశ్, సహానా ఇద్దరు అప్పుడప్పుడు గొడవపడేవారు. రిసార్టు విక్రయించరాదంటూ సహానా పట్టుబట్టింది. ఇదే విషయంపై గురువారం రాత్రి దంపతులు గొడవపడ్డారు. సహనం కోల్పోయిన గణేశ్‌ భార్యపై తన లైసెన్స్‌ రివాల్వర్‌తో కాల్చి చంపాడు.  పోలీసులు తనను అరెస్ట్‌ చేస్తారనే భయంతో ఇద్దరు పిల్లలను కారులో కనకపురరోడ్డులో ఉన్న ఫాంహౌస్‌కు తీసుకెళుతూ కారులో ఉండగానే ఇద్దరు పిల్లలను రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో వారు రక్తమోడుతున్నా కారు డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లారు. సహానా హత్య విషయం తెలుసుకున్న జయనగర పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించిన అనంతరం నిందితుడు గణేశ్‌ కోసం గాలింపులు చేపట్టారు.

కనకపురరోడ్డులో పారిపోతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంబడించి కారు నెంబరు ఆధారంగా అతడిని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలను కనకపురరోడ్డులో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పిల్లల తలల్లో బుల్లెట్లు దూసుకెళ్లడంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేపట్టారు. అయితే వారి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు గణేశ్‌ను జయనగర పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. సహాన మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.   

మరిన్ని వార్తలు