అభాగ్యురాలిపై కట్న పిశాచి పంజా

17 Apr, 2019 10:42 IST|Sakshi
భర్త దామోదర్‌తో రాజేశ్వరి

తల్లిదండ్రులకు దూరమై ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందిన అన్నాచెల్లి

రెండేళ్ల క్రితం యువతిని పెళ్లి చేసుకున్న పురుషోత్తపురం యువకుడు

అప్పటి నుంచి అదనపు కట్నం కోసం తల్లితో కలిసి వేధింపులు

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తల్లిదండ్రులు ఎవరో.. అయిన వారెవరో తెలియని మూడేళ్ల ప్రాయంలో దొరికిన చిన్నారిని, ఆమె అన్నను పోలీసులు ప్రేమ సమాజంలో చేర్పించారు. సమాజం అండతో చదువుకుని సొంత కాళ్లపై బతుకుతున్న క్రమంలో... ఆదర్శ వివాహం చేసుకున్న ఓ యువకుడు ఆ యువతికి ప్రస్తుతం నరకం చూపిస్తున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని అనాథ యువతిపై తల్లితో కలిసి దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా ఆ తల్లీకొడుకు దాష్టీకానికి పాల్పడడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.

వివరాల్లోకి వెళ్తే... ప్రేమగా చూసుకోవాల్సిన భర్త, అత్త అదనపు కట్నం కోసం ఆరు నెలల గర్భిణిపై అమానుషంగా దాడి చేశారు. ప్రస్తుతం బాధితురాలు గిరిజాల రాజేశ్వరి (23) కేజీహెచ్‌ ప్రసూతి విభాగంలో చికిత్స పొందుతోంది. బాధితురాలు రాజేశ్వరి, ఆమె అన్న చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం... తల్లిదండ్రులు ఎవరో, ఎక్కడి వారో తెలియని రాజేశ్వరిని, ఆమె అన్న చంద్రశేఖర్‌ను పోలీసులు డాబాగార్డెన్స్‌ ప్రేమ సమాజంలో కొద్ది సంవత్సరాల కిందట అడ్మిట్‌ చేర్పించారు. అప్పటికి రాజేశ్వరికి మూడేళ్లు, చంద్రశేఖర్‌కు ఆరేళ్లు. ప్రేమ సమాజం అందించిన సాయంతో రాజేశ్వరి ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం వరకూ చదువుకొంది. అయితే యుక్త వయసు వచ్చిన వారు ప్రేమ సమాజంలో ఉండే అవకాశం లేనందున బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకుని ఎన్‌ఏడీ కొత్తరోడ్డులో సొంతంగా బ్యూటీపార్లర్‌ను పెట్టుకుంది.

ముందే పెళ్లి చేసుకుని మోసగించి...
వివాహం జరిగిన తర్వాత కొంత కాలం రాజేశ్వరిని బాగా చూసుకున్న అత్త, భర్త అదనపు కట్నం కోసం నరకం చూపించడం మొదలు పెట్టారు. ఇదే క్రమంలో ఆమె నడుపుతున్న బ్యూటీ పార్లర్, ఐదు తులాల బంగారు గొలుసును అమ్మించి దామోదర్‌ కారు కొనుక్కున్నాడు. అయితే దామోదర్‌కు స్వాతి అనే యువతితో ముండే వివాహం జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. ఒక రోజు రాజేశ్వరికి స్వాతి ఫోన్‌చేసి ఎలా అయినా చంపించేస్తానని హెచ్చరించింది. దీంతో రాజేశ్వరి భర్తను నిలదీయగా తనకు ఇదివరకే వివాహం జరిగిందని ఒప్పుకోవడంతోపాటు మరింతగా హింసించడం మొదలు పెట్టాడు. వివాహమైన రెండేళ్లలో మూడు అబార్షన్‌లు చేయించాడు.

ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అయిన రాజేశ్వరిని అత్త, భర్త పెడుతున్న హింసలకు తట్టుకోలేక అత్తవారిల్లు వదిలి ఎన్‌ఏడీ కూడలిలో ఒంటిరిగా ఉంటోంది. కలర్స్‌ సంస్థలో పనిచేస్తూ బతుకుతున్న రాజేశ్వరి వద్దకు మంగళవారం మధ్యాహ్నం వచ్చిన దామోదర్‌ ఆస్పత్రికి తీసుకెళ్తానని ఇంటి నుంచి బటయకు తీసుకొచ్చి కారులో ఎక్కించాడు. అప్పటికే కారులో ఉన్న తల్లి లలితతోపాటు దామోదర్‌ విపరీతంగా కారులోనే కొట్టుకుంటూ పురుషోత్తపురం వరకూ తీసుకెళ్లారు. అక్కడ కారు నుంచి తప్పించుకున్న రాజేశ్వరి పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని భర్త, అత్తలపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరి పరిస్థితిని గమనించి కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించడంతో ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో చేరి చికిత్స పొందుతుంది. అన్ని పరీక్షలు పూర్తయితే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు.

కట్నం వద్దంటూనే వేధింపులు
రాజేశ్వరి, ఆమె అన్న చంద్రశేఖర్‌ ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో అక్కడి వృద్ధాశ్రమంలో ఉన్న తన అమ్మమ్మను చూసేందుకు పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన దామోదర్, అతడి తల్లి లలిత తరచూ వచ్చిపోతుండేవారు. ఆ క్రమంలో రాజేశ్వరితో పరిచయం పెంచుకున్నారు. ప్రేమ సమాజం నుంచి వెలుపలికి వచ్చి బ్యూటీ పార్లర్‌ తెరిచిన తరువాత తల్లీ కొడుకు రాజేశ్వరిని, ఆమె అన్న చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు. రాజేశ్వరిని తన కొడుకు దామోదర్‌కు చేసుకుంటానని చెప్పారు. తమ పరిస్థితి మొదటి నుంచి చూస్తున్నారు కనుక కట్నకానుకలు ఇచ్చుకోలేమని చెప్పిన చంద్రశేఖర్‌తో అటువంటివి అక్కరలేదని చెప్పి, వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా వారం రోజులు ఉందనగా తమ వద్ద డబ్బులు లేవని, ఎలా అయినా డబ్బులు సర్దుబాటు చేయాలని దామోదర్‌ తల్లి లలిత చెప్పడంతో రాజేశ్వరి, చంద్రశేఖర్‌ రూ.1.20లక్షలు ఇచ్చారు.

మరిన్ని వార్తలు