మస్తు తాగిండ్రు..

11 Apr, 2019 11:57 IST|Sakshi

సాక్షి, కొల్చారం(నర్సాపూర్‌): ఎన్నికలు వచ్చాయంటే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ దిశగానే ప్రతీ పార్టీ మద్యాన్ని ఎన్నికల్లో ఏరుల్లా పారిస్తుంది. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా గడిచిన ఐదు రోజుల వ్యవధిలోనే మెదక్‌ జిల్లావ్యాప్తంగా ఏకంగా రూ.20.84కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే ఎంతమేర పంపిణీ చేశారో అర్థం చేసుకోవచ్చు.  కొల్చారం మండలం చిన్నఘణాపూర్‌ శివారులోని మద్యం ఆధారిత నిల్వ కేంద్రం(ఐఎంఎల్‌) ద్వారా జిల్లాలోని 108 మద్యం దుకాణాలకు, బార్లకు ఇక్కడి నుంచి మద్యం పంపిణీ జరుగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్‌ 15న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి డిసెంబర్‌ 3వ తేది వరకు రూ.44.41కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

అనంతరం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 16 రోజుల వ్యవధిలో రూ.56.75కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజులు ఐఎంఎల్‌ డిపోకు సెలవులు పోగా మిగిలిన ఐదు రోజుల్లో లిక్కర్‌ 12615 కేసులు, మద్యం విలువ రూ.14కోట్ల 90లక్షలు కాగా, బీరు 1848 కేసులు.. విలువ రూ.5కోట్ల 93లక్షలు అమ్ముడయ్యాయి.  మొత్తంగా అమ్ముడైన మద్యం విలువ రూ.20 కోట్ల 84లక్షల 289లు. ఇంతపెద్ద మొత్తంలో మద్యం అమ్మకాలు జరగడం పరిశీలిస్తే ఎన్నికల్లో మద్యం ప్రభావం ఎంతన్నది 
తెలుస్తుంది. 

మరిన్ని వార్తలు