వివాహిత హత్య...! 

17 Jan, 2020 11:07 IST|Sakshi
సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్న సీఐ సింహాద్రినాయుడు, ఎస్‌ఐ కృష్ణమూర్తి (ఇన్‌సెట్‌లో) హత్యకు గురైన కాంతమ్మ

కొండకెంగువ సమీపంలో హత్య 

భార్య హత్య – పరారైన భర్త

దర్యాప్తు చేస్తున్న పోలీసులు  

రామభద్రపురం: మండలంలోని కొండకెంగువ గ్రామ సమీపంలో కోళ్ల ఫారం వద్ద వివాహిత హత్యకు గురైన సంఘటన గురువారం వేకువజామున చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, కోళ్ల ఫారం యజమాని తెలిపిన వివరాలు... పాచిపెంట మండలం తాడూరు కు చెందిన ఊలం పైడిరాజు భార్య కాంతమ్మతో కలసి రెండు నెలల క్రితం కొండకెంగువ గ్రామానికి చెందిన శిరిపురం శ్రీనివాసరావు కోళ్ల ఫారంలో కాపలాదారుడుగా చేరాడు.

కోళ్లఫారం వద్దే చిన్న పూరిగుడిసెలో నివాసం ఉంటూ ప్రతీ రోజూ మద్యం సేవించి భార్యాభర్తలిద్దరూ గొడవలు పడేవారు. బుధవారం సంక్రాంతి పండగ కావడంతో కోళ్లఫారం యజమాని ఆ రోజు వేగంగా కొండకెంగువలో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు. గురువారం వేకువజామున ఫారం యజమాని శ్రీనివాసరావు కొళ్లఫారం వద్దకు వచ్చి కాపలాదారుని పిలిచేందుకు ఇంటికి వెళ్లేసరికి కాపలాదారుని భార్య కాంతమ్మ రక్తపుమడుగులో పడి కొన ఊపిరితో ఉంది.

కాపలాదారుడు భర్త పైడిరాజు ఆచూకీ లేకుండా పోయాడు. వెంటనే ఫారం యజమానికి విషయం తెలియక  ప్రథమ చికిత్స నిమిత్తం బాధితురాలిని ఆటోలో బాడంగి సీహెచ్‌సీకి తరలించాడు. అక్కడ చికిత్స కోసం ఆటో దించేసరికి కాంతమ్మ మృతి చెందింది. వెంటనే ఫారం యజమాని శ్రీనివాసరావు బంధువులకు, స్థానిక పోలీసులకు విషయాన్ని తెలియజేశాడు. పోలీసులు బాడంగి సీహెచ్‌సీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా తల, ముఖం, శరీరంపై గాయాలు ఉండటంతో హత్యేనని నిర్ధారించారు.

గతంలో కూడా చాలా సార్లు మద్యం సేవించి భార్యాభర్తలిద్దరూ గొడవలు పడేవారని అల్లుడు పైడిరాజే తన కుమార్తె కాంతమ్మను హత్య చేశాడని మృతురాలి తండ్రి తేడా పూసపాటి సోమరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు సాలూరు సీఐ సింహాద్రినాయుడు, ఎస్‌ఐ ఎస్‌.కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చేపట్టారు. పండగ పూట హత్యోదంతం తెలిసి మృతురాలి సొంత గ్రామం పాచిపెంట మండలం తాడూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా