కట్టుకున్నవాడే కాల యముడయ్యాడు

17 Feb, 2019 10:44 IST|Sakshi
విజయ మృతదేహం

ఇందల్‌వాయి(నిజామాబాద్‌ రూరల్‌): జీవితంలో సగభాగం పంచి భార్యను సుఖపెట్టాల్సిన భర్త ఆమె పాలిట కాలయముడై కడతేర్చిన బాధాకర ఘటన మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపల్లెకి చెందిన కుంట విజయ(45)కు ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన గంగబాపుతో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ప్రశాంత్, శ్రీకాంత్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పని చేయకుండా మద్యానికి బానిసై గ్రామంలో అందరితో గొడవలు పెట్టుకొని అప్పుల పాలై కుటుంబ ప్రతిష్టను దిగజార్చిన గంగబాపును విడిచి కుంట విజయ తన తల్లిగారి గ్రామమైన ఎల్లారెడ్డిపల్లెలో తన కుమారులను పోషిస్తూ జీవిస్తుంది. ఈ క్రమంలో తన కుమారులను గల్ఫ్‌ దేశాలకు పంపి గ్రామంలో ఇల్లు కూడా కొనుగోలు చేసింది. భార్య దూరమైన క్రమంలో గంగబాపు కూడా బయటి దేశాలకు వెళ్లి మూడు నెలల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చాడు.

కొడుకులు లేని అదును చూసి భార్యకు మాయ మాటలు చెప్పి తనకు దగ్గరై కొంత కాలం మంచి వాడిగా నటించి పాడి పశువులు పెంచుతూ, సమీపంలో ఉన్న విశ్వ ఆగ్రోటెక్‌ గొర్రెల ఫామ్‌లో కూలి పనులు చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మద్యానికి మరల బానిసై భార్యను వేదిస్తూ తరుచూ గొడవలు పడేవాడని గ్రామస్తులు తెలి పారు. అదే క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగి భార్యతో గొడవ పడి మద్యం మత్తులో సహనం కోల్పోయి రోకలి దుడ్డుతో భార్య తలపై బాది హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.

పొద్దున ఇంటి ముందు పశువులను ఎంతకీ విడిచిపెట్టక పోవడంతో అనుమానం వచ్చిన మృతురాలి అక్క కొడుకు ఇంటి తాళం పగులగొట్టి చూడగా కుంట విజయ రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న సీఐ రామాంజనేయులు, ఎస్‌ఐ రాజశేఖర్‌ ఘటనపై గ్రామస్తుల నుంచి వివరాలు సే కరించి మృత దేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుంట విజయ హత్య వార్త తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని విజయ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు