ప్రేమ బంధానికి కులం కాటు

20 Apr, 2019 09:34 IST|Sakshi
సరోజ, జగదీశ్వర్‌రెడ్డి దంపతులు (ఫైల్‌)

ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కులం పట్టింపు

ప్రమాదంలో గాయపడిన భార్యను హతమార్చిన భర్త

పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్న నిందితుడు

వారిద్దరి కులాలు వేరు.. ఒకరినొకరు మనసుపడ్డారు..కొన్నాళ్లపాటు కలిసి తిరిగారు.. నీకు నేను..నువ్వు నాకు.. ఒకరికిఒకరం ఇద్దరం.. కడదాకా కలిసే బతుకుదామంటూ బాసలు చేసుకున్నారు. పెళ్లితో ఒక్కటవుదాతామని పెద్దల నిర్ణయం కోరారు. కులాంతర వివాహమని అందుకు అబ్బాయి తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. వీడిపోయి ఉండలేం..తమనెవరూ వేరుచేయలేరు..కలిసే  చివరిదాకా ఉంటాం..పెళ్లితో ఒక్కటవుదాం అంటూ మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. ఓ వైపు కాపురం సాఫీగా సాగిపోతుంటే.. మరో వైపు కులచిచ్చు రగిలిపోయింది. ఇద్దరి మధ్య కలహాలు రానే వచ్చాయి.. అమ్మాయిని అడ్డు తొలగించుకుని తల్లిదండ్రుల చెంతకు చేరాలని అబ్బాయితలిచాడు. అనుకున్నదే తడవు అవకాశం కోసం ఎదురుచూస్తుంటే యాదృచ్ఛికంగా రోడ్డు ప్రమాదాన్ని అవకాశంగా మలుచుకొని భార్యను కడతేర్చిన ఘటన కూడేరు మండలం కమ్మూరు వద్ద చోటుచేసుకుంది.  

అనంతపురం, కూడేరు: కుల రక్కసి కాటుకు వివాహిత బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కులంపై పట్టింపునకు పోయిన భర్తే భార్య పాలిట కాలయముడిగా మారాడు. మృతురాలి తండ్రి, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన గంగరత్నమ్మ, శివారెడ్డి దంపతుల కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి, అనంతపురం నగరంలోని సుశీల్‌రెడ్డి కాలనీకి చెందిన ప్రభుదాస్‌ కుమార్తె సరోజ (25)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సరోజది ఎస్సీ సామాజిక వర్గం కావడంతో జగదీశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు దగ్గరకు తీసుకోలేదు. సరోజ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఆమోదం తెలపడంతో వారి ఇంటికి రాకపోకలు కొనసాగించేవారు. జగదీశ్వర్‌రెడ్డి ఓ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో తమ సంసార జీవితానికి భార్య కులం అడ్డు వచ్చింది. నెమ్మదిగా కలహాలు మొదలయ్యాయి. 

మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ నబిరసూల్
హత్యకు కుట్ర పన్నిందిలా..
సరోజకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో కూడేరులో నాటు వైద్యం కోసం శుక్రవారం వేకువజామున ద్విచక్రవాహనంలో దంపతులిద్దరూ బయల్దేరారు. కమ్మూరు వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా లారీ వెళ్లడంతో బిత్తరపోయి బైక్‌ను పక్కకు తిప్పే క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన కిందపడ్డారు. అప్పుడే జగదీశ్వర్‌రెడ్డిలో ఆలోచన వచ్చింది. తక్కువ కులం అమ్మాయిని చేసుకున్నానన్న మానసిక క్షోభ నుంచి బయటపడాలంటే భార్యను కడతేర్చాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సమీపంలోని బండరాయిని తీసుకొని భార్య తలపై మోది హతమార్చాడు. అనంతరం తను అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరాడు. రోడ్డు ప్రమాదంలో సరోజ మృతి చెందినట్లు స్నేహితులకు, ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారమందించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది ప్రమాదం కాదని, అల్లుడే హతమార్చాడని సరోజ తండ్రి ప్రభుదాస్‌ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ నబీరసూల్‌ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురానికి తరలించారు. ఎస్‌ఐ తనదైన శైలిలో జగదీశ్వర్‌రెడ్డిని విచారించగా కుటుంబ కలహాల నేపథ్యంలో తానే హతమార్చినట్లు అంగీకరించాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా