వివాహిత దారుణహత్య 

23 Sep, 2019 11:04 IST|Sakshi
హత్యకు గురైన మల్లమ్మ

సాక్షి, అనంతపురం(శెట్టూరు) : యాటకల్లులో దారుణం జరిగింది. భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. అనుమానం పెనుభూతం కావడంతో భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు, ఫిర్యాదుదారులు తెలిపిన వివరాల మేరకు... యాటకల్లుకు చెందిన చంద్ర, మల్లమ్మ (37) 16 ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు కళ్యాణదుర్గం ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు సూరి స్థానిక జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతుల మధ్య కొంత కాలంగా విభేదాలు పొడసూపాయి. 

అనుమానంతో అంతమొందించాడు! 
భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త తరచూ ఆమెను వేధించేవాడు. అనుమానం కారణంగా గ్రామంలో ఉన్న తల్లిదండ్రుల ఇంటి వద్దకు కూడా భార్యను పంపేవాడు కాదు. ఆదివారం ఉదయం బట్టలు ఉతకడానికి మల్లమ్మ సిద్ధమవగా వెనుకనుంచి వచ్చిన భర్త గొడ్డలితో దాడి చేశాడు. తలకు తీవ్రగాయమై మల్లమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. బంధువులు, చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చే లోపే ఆమె ప్రాణాలు విడిచింది. అనుమానంతోనే తన కుమార్తెను చంపేశాడని మల్లమ్మ తల్లిదండ్రులు రామన్న, గంగమ్మలు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని కళ్యాణదుర్గం రూరల్‌ సీఐ శివశంకర్‌ నాయక్, ఎస్‌ఐ శివలు పరిశీలించారు. హతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  

హత్యకు గురైన మల్లమ్మ (ఇన్‌సెట్‌) మల్లమ్మ (ఫైల్‌)  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు