భార్యను కడతేర్చిన భర్త

18 Jun, 2018 08:31 IST|Sakshi
సురేష్, స్వాతి పెళ్లి నాటి ఫొటో, స్వాతి మృతదేహం

అనుమానంతోనే హత్య

పోలీసుల అదుపులో నిందితుడు

ఏర్పేడు:  అనుమానంతోపాటు కట్నం తీసుకురాలేదని భార్యను భర్త కడతేర్చిన సంఘటన ఆదివారం ఇసుకతాగేలి పంచాయతీ గోపాలపురంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రేణిగుంట మండలం వేణుగోపాలపురం ఒడ్డిమిట్టకు చెందిన కృష్ణయ్య, పద్మ కుమార్తె స్వాతి(21)ని ఏర్పేడు మండలం ఇసుకతాగేలి పంచాయతీ గోపాలపురానికి చెందిన వెంకటయ్య, చిట్టెమ్మ కుమారుడు సురేష్‌(28)కు ఇచ్చి మూడేళ్ల క్రితం పెళ్లి చేశారు. వీరి సంసారం ఏడాది పాటు సజావుగా సాగింది. సురేష్‌ మద్యానికి బానిసయ్యాడు. ఏడాది క్రితం సురేష్‌ తల్లి చిట్టెమ్మ కువైట్‌కు వెళ్లింది. అప్పటి నుంచి అను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అంతేగాక కట్నం తీసుకురావాలని వేధించేవాడు.

స్వాతి పలుమార్లు పుట్టింటి నుంచి రూ.20 వేలు, రూ.30 వేలు తెచ్చి ఇచ్చింది. శనివారం స్వాతి రేణిగుంటలో జరిగే సంతకు వెళ్లింది. సురేష్‌ భార్యకు ఫోన్‌ చేసి సరుకులు తీసుకున్న తర్వాత పుట్టింటికి వెళ్లి రూ.లక్ష తీసుకుని రావాలని చెప్పాడు. అంత మొత్తం తల్లిదండ్రుల వద్ద ఉండదని భార్య చెప్పినా అతను వినలేదు. ఆమె సరుకులు తీసుకుని సాయంత్రం గోపాలపురం వచ్చింది. రాత్రి ఏమి జరిగిందో కానీ ఆదివారం ఉదయం స్వాతి మృతి చెంది ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అనుమానంతోనే హత్య చేశా..
పరారీలో ఉన్న మృతురాలి భర్త సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భార్య స్వాతిని అనుమానంతో డిష్‌ వైర్‌ మెడకు బిగించి హత్య చేసినట్టు అతను అంగీకరించినట్టు ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు. సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు