అనుమానం పెనుభూతం!

6 Oct, 2018 14:06 IST|Sakshi
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తెన్నేటి గోవిందమ్మ మృతురాలు తిరుపతమ్మ మృతుడు రాంబాబు (ఫైల్‌)

అత్త, భార్యపై కత్తితో దాడి

భార్య మృతి, అత్త పరిస్థితి విషమం

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు

తాడేపల్లిలో ఘటన

మూడు ముళ్ల బంధాలు..  అనుమానాల కత్తులకు ముక్కలవుతున్నాయి.  ఏడడుగుల అనుబంధాలు..  అపోహల అగాధంలో కూరుకుని విచ్ఛిన్నమవుతున్నాయి.కడదాకా తోడుంటానన్న ప్రమాణాలు..    క్షణికావేశపు కాష్టంలోకి నిలువునా దహించుకుపోతున్నాయి.  నీవేనేనై.. నేనేనీవై అంటూ ఒక్కటైన జీవితాలు..ఆప్యాయతల మధురిమలు చవిచూడకుండానే అర్ధంతరంగా     ముగిసిపోతున్నాయి.అన్యోన్యపు దాంపత్యాలు.. అనైతిక ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని మృత్యువు దారుల్లో ఓడిపోతున్నాయి.శుక్రవారం తాడేపల్లిలో భర్త అనుమానమే పెనుభూతమై భార్యను హతమార్చగా.. విజయపురిసౌత్‌లో అనైతిక సంబంధానికి భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తల్లిదండ్రులు దూరమైన పసి బిడ్డల జీవితాలు.. అయ్యో పాపం అంటూ ప్రతి ఒక్కరి గుండెలపై కన్నీటి ఘోష పెడుతున్నాయి.

గుంటూరు, తాడేపల్లిరూరల్‌: అనుమానంతో ఓ భర్తను భార్యను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అడ్డువచ్చిన అత్తను సైతం తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన తాడేపల్లి పట్టణ పరిధిలోని సలాంహోటల్‌ సెంటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కారంపూడి మండలం గుత్తికొండకు చెందిన దేరంగుల వెంకన్నబాబుకు తాడేపల్లి సలాంహోటల్‌ సెంటర్‌కు చెందిన తిరుపతమ్మ (25)తో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిరువురికి ముగ్గురు సంతానం. అత్తగారింటి సమీపంలోని వేరే ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత రెండేళ్లుగా భార్యపై అనుమానం పెంచుకుని తరచూ హింసిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన తమ కూతురు వేరే వారితో ఇంట్లో ఉందని అత్తింటి వారికి ఫిర్యాదు చేయగా వారు వచ్చి పరిశీలించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అల్లుడిని మందలించి అత్త గోవిందమ్మ కూతురిని తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లారు.

ఈ సమయంలో తిరుపతమ్మ ముగ్గురు పిల్లల్ని అక్కడే వదిలేసి రావడంతో 4వ తేదీ సాయంత్రం అత్తగారింటికి వచ్చి పిల్లల ఆధార్‌కార్డు కావాలంటూ వెంకన్నబాబు గొడవ చేశాడు. భార్య తిరుపతమ్మ ఆధార్‌కార్డ్‌లు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన వెంకన్నబాబు నిన్ను అంతం చేస్తానంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అత్తగారింటికి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై దాడికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన అత్తను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తిరుపతమ్మ మృతి చెందగా, గోవిందమ్మ అపస్మారకస్థితిలోకి జారుకుంది.  ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేరంగుల వెంకన్నబాబు మాత్రం తన భార్యను చంపి మంచి పని చేశానని, గత మూడేళ్ల నుంచి తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.  

మరిన్ని వార్తలు