దుర్వ్యసనాలు మానుకోమన్నందుకే..

10 May, 2019 12:45 IST|Sakshi
నిందితుడిని ప్రదర్శిస్తున్న సీఐ శివశంకర్, ఎస్‌ఐ అబీబ్‌బాషా

భార్యను గొంతు నులిమి చంపి ఆత్మహత్యగా చిత్రించిన భర్త

కేసును ఛేదించిన పోలీసులు

కృష్ణాజిల్లా పామర్రు : వివాహిత ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. దుర్వ్యసనాలు మానేయాలంటూ రోజూ ఇబ్బందులు పెడుతోందన్న కసితోనే భార్య గొంతు నులిపి చంపేశాడు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. పామర్రు సీఐ డి శివశంకర్‌ గురువారం తన కార్యాలయంలో మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 5వ తేదీ రాత్రి నాగపట్నం వద్ద హోటల్‌ నిర్వహిస్తున్న జువ్వనపూడి ప్రశాంతి ఆత్మహత్య చేసుకున్న ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో విచారణ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జుఝవరం గ్రామానికి చెందిన మృతురాలి తండ్రి మట్టా కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతురాలు ప్రశాంతి (32) కి 2007లో రిమ్మనపూడి గ్రామానికి చెందిన జువ్వనపూడి అంజిబాబుతో వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం. మృతురాలి భర్త చంటిబాబు మొదటి నుంచి దుర్వ్యసనాలకు బానిస. మద్యం తాగటం, ఆడవాళ్లతో తిరుగుతూ భార్యను అనుమానిస్తుండేవాడు. ఏ కారణం లేకుండా తరచూ భార్యను చులకనగా చూస్తూ, ఆమెను కొడుతూ, తిడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతుండేవాడు.

భర్త ఇబ్బందులను తాళలేక పది రోజుల క్రితం పిల్లలతోసహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో చంటిబాబు జుఝవరం వెళ్లి ప్రశాంతి తల్లిదండ్రులను బతిమిలాడి బాగా చూసుకుంటానని చెప్పి ఈనెల 3న నాగపట్నం తీసుకువచ్చాడు. అయితే, తర్వాత కూడా చంటిబాబులో మార్పు రాలేదు. మద్యం సేవించడం, తిరగటం, కొట్టడం చేస్తుండటంతో భరించలేని ప్రశాంతి ఈనెల 5 వ తేదీ రాత్రి గట్టిగా ప్రశ్నించింది. మద్యం మత్తులోఉన్న చంటిబాబు తన భార్యను మంచంపైకి నెట్టి రెండు చేతులతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె చీరతో గట్టిగా మెడ చుట్టూ బిగించి ఫ్యానుకు ముడి వేసి ఉరి వేసుకున్నదని అందరిని నమ్మించి నేరం నుంచి తప్పించుకోవాలని చూశాడు. అయితే, పోలీసులు తమదైన శైలిలో విచారణ నిర్వహించడంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనిని గురువారం కోర్టులో హాజరుపరిచామని సీఐ తెలిపారు. సెక్షన్‌ 498(ఎ), ఐపీసీ 302 తో పాటు సెక్షన్‌ 201 కూడా కలిపి దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎస్‌ఐ అబీబ్‌ బాషా, పీ ఎస్‌ఐలు సూర్య, గాయత్రీ, హెడ్‌ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు