వివాహిత మృతిపై రగడ

11 Sep, 2019 08:09 IST|Sakshi
చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్ వద్ద సర్పంచ్‌ భర్తపై దాడికి దిగిన భాగిర్థపల్లి గ్రామస్తులు

చంపి బావిలో పడేశారని కుటుంబ సభ్యుల ఆగ్రహం

మల్లుపల్లి సర్పంచ్‌ భర్తపై దాడి

చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్  వద్ద ఉద్రిక్తత

చిన్నశంకరంపేట(మెదక్‌): వివాహిత మహిళలను వేదింపులకు గురిచేసి చంపి బావిలో పడేశారని ఆరోపిస్తు చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన చిట్కూల శ్రీలత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన చిట్కుల లింగం భార్య శ్రీలత(24) సోమవారం బావిలో శవమైతేలింది. ఇంట్లో గొడవపడి ఆదివారం ఇంటి నుంచి వెల్లిన శ్రీలత బావిలో పడి శవమై తేలడంతో, శ్రీలత తల్లి గ్రామమైన కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌ మండలం భాగీర్థపల్లి గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా మంగళవారం మధ్యాహ్నహం మల్లుపల్లి గ్రామస్తులు, భాగిర్థిపల్లి గ్రామస్తులు పెద్దల సమక్షంలో విషయంపై పంచాయితీలో మాట్లాడుతుండగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

ఒక్కసారిగా గుంపుగా మల్లుపల్లి సర్పంచ్‌ లక్ష్మి భర్త శంకరయ్యపై దాడికి దిగారు. విషయం గ్రహించిన పోలీస్‌లు వెళ్లి శంకర్యను వారి భారి నుంచి కాపాడి పోలీస్‌స్టేషన్ కి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్ ఎదుట చేరి శ్రీలతను హత్య చేసీ బావిలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్యతో పాటు శ్రీలత అత్త, భర్తలను తమకు అప్పగించాలని పోలీస్‌లతో వాగ్వావాదానికి దిగారు. దీంతో తూప్రాన్ సీఐ స్వామిగౌడ్‌ భాగిర్థపల్లి గ్రామస్తులను సముదాయించారు. భాగిర్థపల్లి సర్పంచ్, మాజీ సర్పంచ్‌లతో మాట్లాడి గ్రామస్తులను పోలీస్‌స్టేషన్ బయటకు తీసుకువెళ్లాలని లేదా లాఠీ చార్జి చేయాల్సి వస్తుందని హెచ్చరించడంతో వారు గ్రామస్తులను సముదాయించి బయటకు తీసుకువెళ్లారు. 

భర్త, అత్తపై కేసు నమోదు...
శ్రీలత మృతికి కారణమైన భర్త లింగం, అత్త కళవ్వలపై కేసు నమోదు చేసినట్లు చిన్నశంకరంపేట ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్‌ తెలిపారు. శ్రీలతను అత్తింటివారే వరకట్నం వేదింపులకు పాల్పడి హత్యచేశారని తల్లి బాలవ్వ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవపంచనామా  అనంతరం పోస్ట్‌మార్టం కోసం మెదక్‌ అస్పత్రికి తరలించినట్లు తెలిపారు. తూప్రాన్ సీఐ స్వామిగౌడ్, డీఎస్‌పీ కిరణ్‌కుమార్‌ సంఘటనా స్థలం పరిశీలించారు.

మరిన్ని వార్తలు