అనుమానం రేపిన చిచ్చు

20 Nov, 2018 12:57 IST|Sakshi
నిందితుడు రాజ్‌కుమార్, మృతి చెందిన పార్వతి (ఫైల్‌)

భార్యను కడతేర్చిన భర్త

నిందితుడి కోసం పోలీసుల గాలింపు

తమిళనాడు, అన్నానగర్‌: అనుమానంతో భార్యను హత్యచేసి పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తిరుచ్చి జిల్లా, ఉప్పిలియపురం సమీపం వెళ్లాలపట్టి కాట్టుకోట్టగై ప్రాంతానికి చెందిన తంగవేల్‌ (48). ఇతని సొంత ఊరు సేలం జిల్లా, గెంగవల్లి తాలుకాలోని నాకియమ్‌పట్టి గ్రామం. ఏడాది కిందట వెళ్లాలప్పట్టిలోని ఇళంగోకి సొంతమైన తోటను కౌలుకు తీసుకుని అక్కడే కుటుంబంతో ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. తంగవేల్‌ తన కుమార్తె పార్వతి (26)ని తిరుచ్చి కేకేనగర్‌ ఇంద్రానగర్‌కి చెందిన రాజ్‌కుమార్‌కి ఇచ్చి వివాహం చేశాడు. వీరికి శ్రీధర్‌ (8) కుమారుడు, సుధా (7) కుమార్తె ఉన్నారు. విదేశంలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ కుటుంబ ఖర్చులకు నగదు పంపలేదని తెలుస్తోంది.

పార్వతి భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబం నెట్టుకొస్తోంది. ఈ స్థితిలో గత 5 నెలల కిందట తిరుచ్చికి వచ్చిన రాజ్‌కుమార్‌ భార్య ప్రవర్తనపై అనుమానంతో రోజూ తాగి వచ్చి గొడవ పడేవాడు. పది రోజుల కిందట పార్వతిని ఆమె పుట్టింటిలో వదిలి వెళ్లాడు. ఈ స్థితిలో పార్వతి పిల్లలను చూసేందుకు తిరుచ్చికి రాగా రాజ్‌కుమార్‌ తిట్టి పంపాడు. అనంతరం పార్వతి పుట్టింటికి చేరుకుంది. ఆదివారం రాత్రి పార్వతి ఇంట్లో నిద్రిస్తుండగా అక్కడికి వచ్చిన రాజ్‌కుమార్‌ ఆమెను కత్తితో పొడిచాడు. పార్వతి కేకలు వేయడంతో తంగవేల్‌ ఇంట్లోకి వెళ్లి రాజ్‌కుమార్‌ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అతనిపై కూడా దాడి చేసి రాజ్‌కుమార్‌ పరారయ్యాడు. ఇరుగుపొరుగు వారు పార్వతిని, తంగవేల్‌ని చికిత్స కోసం తురైయూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పార్వతి అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. తంగవేల్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి పరారైన రాజ్‌కుమార్‌ కోసం గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా