కట్టుకున్నవాడే కాలయముడై...

22 Jan, 2019 07:19 IST|Sakshi
విలపిస్తున్న కుమార్తెను ఓదారుస్తున్న స్ధానికులు

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

ఎదురుతిరిగిన కోడలిపై కత్తితో దాడికి యత్నం

విజయనగరం టౌన్‌: అనుమానం ఆమె పాలిట శాపంగా మారింది. కట్టుకున్నవాడే కాలయముడై కడతేర్చాడు. ఎవరో చెప్పిన మాటలు  విని ఆదివారం నుంచి భార్యతో తగాదా పడుతూనే వస్తున్నాడు. సోమవారం ఉదయం కూడా భార్యతో గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరగడంతో పక్కనే ఉన్న కత్తితో దాడి చేసి హతమర్చాడు. మృతురాలి కుటుంబ సభ్యులు, డీఎస్పీ డి. సూర్యశ్రవణ్‌కుమార్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కణపాక అగురువీధిలో నివాసముంటున్న శీల మారమ్మ (50)  సోమవారం ఉదయం హత్యకు గురైంది. అనుమానంతో రగిలిపోతున్న భర్త సన్యాసిరావు ఆమెను అతి కిరాతంగా కత్తితో చేయి నరికి అనంతరం కడుపులో ఐదుకి పైగా పోట్లు పొడిచి చంపేశాడు.

అడ్డుకోవడానికి వెళ్లిన కోడలను చంపేద్దామని కత్తితో పైకి లేవగా, ఆమె తప్పించుకుని పరుగులు  తీసింది. ఎటువంటి చెడు అలవాట్లు లేని సన్యాసిరావుకు భార్య ప్రవర్తన బాగోలేదని చెప్పడంతో అది మనసులో పెట్టుకున్నాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. సోమవారం వేకువజామును మరలా గొడవ పెట్టుకున్నాడు. అనంతరం ఎవరి పనుల్లో నిమగ్నమవ్వగా  మారమ్మ తన భర్తకు టిఫిన్‌ తీసుకువచ్చింది. ఈక్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అందుబాటులో ఉన్న పొడవాటి కత్తితో కర్కశంగా చేతిని నరికేశాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్న ఆమెపై మరలా కత్తితో దాడి హత్య చేశాడు. ఈ సంఘటన చూసిన కోడలు గట్టిగా కేకలు వేయడంతో ఆమెపై కూడా దాడికి ప్రయత్నించగా.. భయంతో బయటకు పరుగులు తీసింది. విషయాన్ని స్థానికుల సహాయంతో పోలీసులకు చేరవేసింది. వెంటనే డీఎస్పీ డి. సూర్యశ్రవణ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి  చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు శ్రీనివాసరావు, వెంకటరావు,  కుమార్తె సత్యవతిలు ఉన్నారు. వీరు ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

ఉలిక్కిపడిన కణపాక
ప్రశాంతంగా ఉండే కణపాకలో ఒక్కసారిగా హత్య జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కట్టుకున్న భర్తే భార్యను హత్య చేయడంతో ప్రజలు భయాందోళన చెందారు. మృతురాలి కుమార్తె, కొడుకులు, మనుమల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

 దర్యాప్తు చేస్తున్నాం
అనుమానంతో హత్యచేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. విచారణ చేపట్టాం. ఆధారాలు సేకరించాం. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం.– డి.సూర్యశ్రవణ్‌ కుమార్, పట్టణ డీఎస్పీ, విజయనగరం

మరిన్ని వార్తలు