అదనపు కట్నం కోసం భార్యను హత్యచేసిన భర్త

1 Aug, 2018 13:42 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏసీపీ వెంకటేశ్వరబాబు 

స్టేషన్‌ఘన్‌పూర్‌ వరంగల్‌ : మూడుముళ్లు వేసి కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్య నందనబోయిన రాధిక(21)ను భర్త రాజ్‌కుమార్‌ హత్య చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి మండలంలోని నమిలిగొండలో జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు నారబోయిన నర్సయ్య, రాజమణి తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన నర్సయ్య, రాజమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు.

వారి పెద్ద కుమార్తె రాధికను మూడేళ్ల క్రితం నమిలిగొండ గ్రామానికి చెందిన నందనబోయిన రాజ్‌కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నంగా రూ.4లక్షలు, నాలుగున్నర తులాల బంగారు నగలు ముట్టజెప్పారు. గతేడాదిగా కట్నం డబ్బులు సరిపోలేదని, మరో రూ.2లక్షలు కట్నం ఇవ్వాలని రాధికను భర్త, అత్తమామలు వేధించ సాగారు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం మరో రూ.50వేలు ఇచ్చారు.

రాధిక అత్తమామలు భూలచ్చమ్మ, కొమురయ్య కొండాపూర్‌ నుంచి ఘన్‌పూర్‌కు వచ్చి సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వచ్చి రాధికకు కడుపులో నొప్పి లేచిందంటూ చెప్పి వెళ్లారు. రాధిక కుటుంబ సభ్యులు నమిలిగొండకు వెళ్లేసరికి ఆమె శవమై ఉందని తల్లిదండ్రులు బోరున విలపించారు. రాధికను తీవ్రంగా కొట్టి హింసించి ముఖంపై మెత్త పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని వారు ఆరోపించారు.

ఆమె చేతులు, నోరు, మెడ, తొడపై గాయాలున్నాయని, నోటి వెంట రక్తం కారి ఉందని తెలిపారు. అదనపు కట్నం కోసం హత్య చేశారని ఆరోపించారు. గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ 

 సీఐ రావుల నరేందర్, ఎస్సై రవి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడిందా, హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఏసీపీ వెంకటేశ్వరబాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

భర్త రాజ్‌కుమార్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అదనపు కట్నం కోసం భార్యను హతమార్చిన భర్తను కఠినంగా శిక్షించాలని ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు