భర్త చేతిలో భార్య హతం

10 Jul, 2018 12:16 IST|Sakshi
చెన్నకేశవులు, సుబ్బలక్షుమ్మల ఫైల్‌ ఫొటో)

ఇల్లు తాకట్టు పెట్టొద్దన్నందుకు రోకలితో కొట్టిన వైనం

రక్తస్రావంకావడంతో భార్య అక్కడికక్కడే మృతి

పోలీసులకు ఫిర్యాదు

వేంపల్లె : ఇల్లు తాకట్టు పెట్టొద్దన్నందుకు వేంపల్లె పట్టణ పరిధిలోని చింతలమడుగుపల్లె గ్రామం బెస్తవీధిలో భార్యను హతమార్చిన ఉదంతమిది. మృతురాలి సోదరుడు నారుబోయిన సుబ్బరాయుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చింతలమడుగుపల్లె బెస్తవీధిలో కొమ్మనబోయిన చిన్న చెన్నకేశవులు, సుబ్బలక్షుమ్మ(48) అనే దంపతులు నివాసముంటున్నారు. వీరికి సుమారు 30ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. భర్త చిన్నచెన్నకేశవులు వ్యసనాలకు బానిసై అప్పులు చేసేవాడు. అప్పులు ఎక్కువ కావడంతో గతంలో వారికి ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మి అప్పులు తీర్చారు. తర్వాత ప్రతి గ్రామానికి వెళ్లి బొరుగులు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు.

ఆమె కూలి పనికి వెళ్లి డబ్బులు అతని చేతికి ఇచ్చేది. కొద్ది కాలం జీవనం సజావుగా సాగింది. కానీ అతను వ్యసనాలకు మరలా బానిస కావడంతో మళ్లీ అప్పులు చేశాడు. దీంతో అప్పులు తీర్చేందుకు ఇల్లు తాకట్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. దీనికి భార్య సుబ్బలక్షుమ్మ ఒప్పుకోకపోవడంతో వారిద్దరి మధ్య కొన్ని రోజులుగా వాగ్వాదం జరుగుతుండేది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఇల్లు తాకట్టు పెట్టేందుకు ఒప్పుకోవాల్సిందేనని ఆవేశంతో తలపై బలంగా రోకలితో కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భార్య చనిపోవడంతో అతను భయపడి ఇంటి నుంచి పరారయ్యాడు. రోజు కూలీకి వెళుతున్న తోటి మహిళ కూలీకి వెళ్లేందుకు ఇంటి తలుపులు తీయగా రక్తపు మడుగులో ఉన్న సుబ్బలక్షుమ్మను చూసి కేకలు వేసింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులివెందుల డీఎస్పీ నాగరాజు, రూరల్‌ సీఐ రామకృష్ణుడు, ఎస్‌ఐ బి.వి.చలపతిలు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు