పెళ్లయిన రెండు నెలలకే కాటికి

11 Jul, 2019 12:10 IST|Sakshi
కుమారుడు మరణవార్త విని నేలపై పడి రోధిస్తున్న రామయ్య తండ్రి కాశయ్య

భార్యను బండరాయితో మోది హతమార్చిన భర్త

ఆనక తానూ పురుగుమందుతాగి ఆత్మహత్య

 గిద్దలూరు మండలంలో ఘోరం 

 రెండు కుటుంబాల్లో తీరని శోకం

సాక్షి, గిద్దలూరు: పెళ్లి బాజాలు చప్పుడు ఇంకా చెవుల్లో రింగుమంటూ ఉండగానే.. ఆ ఇళ్లలో చావు డప్పు మోగింది.. కనీసం రెండు నెలలైనా కలిసి కాపురం చేయక ముందే నవ దంపతులు కాటికి పయనమయ్యారు.. ఆనందం నిండాల్సిన లోగిళ్ళలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. కళకళలాడుతూ తిరగాల్సిన కొత్త జంట విగత జీవులుగా మారారు. ముళ్ల పొదల్లో నిర్జీవంగా పడి ఉన్న మృతదేహాలను చూసి, వారి కన్నపేగులు తల్లడిల్లిపోయాయి.

ఆషాడ మాసమని దూరంగా ఉన్న కొత్త జంట ఒకే చోట శవాలుగా దర్శమివ్వడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. వారి రోధనలు తీరు చూసి అక్కడి వారికి కంటనీరు ఆగలేదు. కట్టుకున్న భార్యను బండరాయితో మోది చంపిన భర్త ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం గిద్దలూరు మండలంలో కలకలం రేపింది. పెళ్లయి రెండు నెలలు కాకముందే నూతన జంట పరలోకాలకు పయనం కావడం రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది.

సేకరించిన వివరాల ప్రకారం.. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పిక్కిలి కాశయ్య అంకాలమ్మ దంపతుల కుమారుడు రామయ్య (22) ప్రొక్లెయిన్‌ డ్రైవరుగా పని చేస్తుంటాడు. అతడికి ఈ ఏడాది మే 19న అదే మండలం ఆదిమూర్తిపల్లెకు చెందిన మండ్ల శ్రీనివాసులు, రమాదేవి దంపతుల కుమార్తె చంద్రకళ (19)తో వివాహమైంది. ఆషాఢం ప్రారంభం కావడంతో చంద్రకళ వారం రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. ఈనెల 9వ తేదీ ఉదయం రామయ్య అత్తింటికి వెళ్లాడు. కంభంలో తన సోదరి ఇంటికి వెళ్లి ఫొటోలు దిగాలని చెప్పి చంద్రకలను బైక్‌పై తీసుకువచ్చాడు. కానీ, కంభం వైపు వెళ్లకుండా బోదివాగు సమీపంలోని తమ పొలం వద్దకు తీసుకెళ్లాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు వారు రామయ్య, చంద్రకళలు పక్కపక్కనే విగత జీవులుగా పడి ఉండటం చూసి, పోలీసులకు సమాచారం అందించారు.

చంద్రకళ మృతదేహంపై ఉన్న గాయాలు, ఘటనా స్థలంలో గుర్తించిన రక్తపు మరకలు ఉన్న బండరాయి, పురుగుల మందు డబ్బాను పోలీసులు పరిశీలించారు. రామయ్యే బండరాయితో తలపై మోది చంద్రకళను హతమార్చాడని, ఆపై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే నిర్ధారణకు వచ్చారు. ఎస్సై సమందర్‌వలి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. యర్రగొండపాలెం సీఐ మారుతికృష్ణ గిద్దలూరు పోలీసుస్టేషన్‌కు వచ్చి ఘటనకు గల కారణాల పై విచారణ చేపట్టారు. 

ఆస్తి తగాదాలే కారణమా..?
ఆస్తి తగాదాల వల్ల నా బిడ్డను చంపి ఉంటారని చంద్రకళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ అల్లుడు రామయ్యకు అతడి తండ్రి కాశయ్యతో ఆస్తి పంపకాల విషయంలో ఘర్షణలు జరిగాయని, ఆ విషయంలో మానసికంగా ఒత్తిడికి గురైన రామయ్య తన కుమార్తెను చంపి ఉంటారని వారు పేర్కొంటున్నారు. తమ కుమార్తె జీవితంపై ఎన్నో కలలు కన్న మండ్ల శ్రీను, రమాదేవి దంపతులు తమ కూతురు సుఖంగా ఉంటుందని నమ్మి పక్కనే ఉన్న గ్రామంలో వ్యక్తికిచ్చి వివాహం చేశారు. 

ఊరికి దగ్గరే కుమార్తె ఉంటే కళ్ల ముందే ఉంటుందని భావించారు. అయితే తమ కుమార్తె ఇలా కట్టుకున్న భర్త చేతిలోనే  హత్యకు గురికావడాన్ని జీర్ణించుకోలేక హత్య జరిగిన ప్రదేశంలో కుమార్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు అయ్యేలా విలపించారు. వారి ఆర్తనాదాలను చూసిన బందుమిత్రులతో పాటుగా, గ్రామస్తుల హృదయాలు చలించిపోయాయి. చుట్టు పక్క గ్రామాలల్లోని ప్రజలు సంఘటనా స్థలం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి మృతుల తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు.

మరిన్ని వార్తలు