కుటుంబాన్ని గాలికొదిలేశాడని..

7 Mar, 2018 10:56 IST|Sakshi
ఆసుపత్రి వద్ద రోదిస్తున్న బంధువులు

ఇద్దరు కూతుళ్లతో తల్లి  ఆత్మహత్యాయత్నం

తల్లీ కూతురి మృతి, మరో కూతురి పరిస్థితి విషమం

దేవరకొండ : అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త మరో మహిళ మోజులో పడి కుటుంబాన్ని వదిలేశాడు... ముగ్గురు పిల్లల పెంపకాన్ని పట్టించుకోలేదు.  పిల్లల చదువులు, బాధ్యత ఆ తల్లిపై పడింది... ఇదేమిటని భర్తను నిలదీసినా, పెద్ద మనుషులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. ఇక చావే శరణ్యమని భా వించి ఇద్దరు కూతుళ్లతో సహా ఆ తల్లి ఆత్మహత్యకు పా ల్పడింది.. ఈ ఘటనలో తల్లి కూతురు మృతిచెందగా, మరో కూతురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన దేవరకొండలో మంగళవారం చోటు చేసుకుంది.

 వివరాలు... నేరెడుగొమ్ము మండలం కాచరాజుపల్లికి చెందిన బొమ్ము అచ్చయ్య మాజీ ఉప సర్పంచ్‌. ఆయనకు పదహారేళ్ల క్రితం రాములమ్మ అనే మహిళతో వివాహామైంది. వారికి పదిహేనేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు, తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నారు. అచ్చయ్య గ్రామంలోనే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అచ్చయ్యకు గ్రామంలో ఉన్న మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం కాస్తా రెండో వివాహం చేసుకోవడానికి దారితీసింది. దీంతో ఆమెను అచ్చయ్య నాలుగేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అచ్చయ్య మొదటి భార్యని పట్టించుకోకపోవడం, పిల్లల ఆలనా, పాలనను చూడకపోవడంతో రాములమ్మ మానసికంగా కుంగిపోయింది.

ఎన్నిసార్లు ఇదేమిటని ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయింది. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నా పట్టించుకోని రాములమ్మ పిల్లలను అచ్చయ్య దూరం చేస్తుండడం, వారి చదువు, పెంపకం, బాధ్యతను కూడా మరవడంతో జీర్ణించుకోలేకపోయింది. తరచూ అచ్చయ్యను నిలదీస్తోంది. ఇదే క్రమంలో పెద్ద మనుషులను ఆశ్రయించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ము గ్గురు పిల్లలను చదివించలేని రాములమ్మ ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించింది. కొడుకును దేవరకొండలోని రాములమ్మ చెల్లెలి ఇంట్లో ఉంచుతూ చదివిస్తోంది. అచ్చయ్య కొన్ని రోజులుగా ఇంటికి రాకపోవడంతో పాటు పట్టించుకోకపోవడంతో మంగళవారం భర్త దేవరకొండలో ఉన్నాడని తెలిసి కలిసేందుకు వచ్చింది.

దేవరకొండలో భర్తను కలిసి మాట్లాడింది. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియరానప్పటికీ తన ఇద్దరు కూతుళ్లతో సహా సీపీఐ పార్టీ కార్యాలయం సమీపంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారిని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సను అందించే క్రమంలో  రెండో కూతురు ప్రియాంక(11), రాములమ్మ(30) మృతిచెందారు. మొదటి కుమార్తె లతమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అచ్చయ్య పిల్లలను పట్టించుకోకపోవడం,  వల్లనే రాములమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని రాములమ్మ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు