భర్తే కాలయయుడు

13 Mar, 2018 09:43 IST|Sakshi
ఆందోళన చేస్తోన్న మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు

భార్యపై కిరోసిన్‌ పోసి..గ్యాస్‌ అంటుకుందని డ్రామా!

అదనపు కట్నం కోసం ఘాతుకం

ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలిన సంధ్య 

న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ    సభ్యుల ఆందోళన

మంథని: అదనపు కట్నం కోసం కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. తల్లితో కలిసి భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఐదు రోజులుగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సంధ్య ఈనెల 10 తుదిశ్వాస విడిచింది. సంధ్య మృతికి కారకులను శిక్షించాలని కోరుతూ మృతురాలి బంధువులు దాదాపు 20 గంటల పాటు ఆందళన చేశారు. ఎస్సై, ఇరు గ్రామాల పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణిగింది.  

ఆరెళ్ల క్రితం పెళ్లి 
మంథని మండలం అడ్య్రాల గ్రామానికి చెందిన మల్లవేన సంతోష్‌(చంటి)తో కాల్వశ్రీరాంపూర్‌ మండలం పాతమడిపెల్లికి చెందిన సంధ్యకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రణీత్‌(5), ప్రణయ్‌(3) కొడుకులు. అదనపు కట్నం కోసం తరచూ వేధించేవాడని సంధ్య తల్లి నరెడ్ల స్వరూప తెలిపారు. ఈక్రమంలోనే వేధింపులు ఎక్కువైతే తనకున్న 24 గుంటల భూమి అమ్మి రూ.8లక్షలు, బంగారం ముట్టజెప్పానని రోదిస్తూ తెలిపింది. మనుమడి పుట్టిన రోజున బంగారం కావాలంటే అప్పగించానని చెప్పింది.

ఈనెల 5న భార్యభర్తల మధ్య జరిగిన గొడవలో భర్త సంతోష్, తన తల్లితో కలిసి తమ కూతురు చేతులు వెనక్కి కట్టేసి కిరోసిన్‌ పోసి నిప్పంటించారని రోదిస్తూ వివరించింది. తమకు మాత్రం గ్యాస్‌స్టౌవ్‌ అంటుకుందని తెలిపారని కన్నీటిపర్యంతమైంది. కాలిన గాయాలతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన కూతురు అసలు విషయం చెప్పిందని పేర్కొంది. ఈనెల 10న తుదిశ్వాస విడిచిన సంధ్య మృతదేహానికి 11న పోస్టుమార్టం నిర్వహించి గ్రామానికి తీసుకొచ్చారు.

సంధ్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం సాయంత్రం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. మంథని ఎస్సై ఉపేందర్‌రావు గ్రామానికి చేరుకుని ఇరు గ్రామాల పెద్దలు కలుగజేసుకోవడంతో ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.    

మరిన్ని వార్తలు