మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్య హత్య

17 Feb, 2020 08:18 IST|Sakshi

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వడం లేదని గొంతుకోసి ఘాతుకం

మునుగోడు మండలం చీకటిమామిడిలో ఘటన

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు

సాక్షి, మునుగోడు : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మద్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వడం లేదని కట్టుకున్న భార్యను కత్తితో గొంతు కొసి హతమార్చాడు. ఈ సంఘటన మునుగోడు మండలంలోని చీకటిమామిడి గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెన్నగోని ముత్యాలు మానసిక వికలాంగుడు. ఏ పనిచేయకుండా ఇంటి వద్దనే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. భార్య జయమ్మ(50) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని సాకుతోంది. అయితే మద్యానికి బానిసైన ముత్యాలు డబ్బుల కోసం నిత్యం భార్యను వేధించేవాడు.

నాలుగైదు రోజులుగా తనకు డబ్బులు ఇవ్వడం లేదని కోపం పెంచుకున్న ముత్యాలు భార్యని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వారం రోజులు క్రితం తమ కుమారుడి వివాహం జరుగగా అతను తన అత్తగారికి ఇంటికి వెళ్లాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్యని గీసకత్తితో గొంతు కొసి చంపేశాడు.

తన భార్య చనిపోయిందని నిర్ణయించుకున్న ఆయన మృతదేహాన్ని ఇంట్లో ఉంచి ఇంటికి తాళం వేసి 7కిలో మీటర్ల దూరంలో ఉన్న మునుగోడుకు నడుచుకుంటూ వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. వెంటనే చండూరు సీఐ సురేష్‌కుమార్‌తోపాటు ఎస్‌ఐలు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా ఆమె మృతిచెంది ఉంది. పదిహేనేళ్ల క్రితం ముత్యాలు తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేయగా అప్పుడు పోలీసులు కేసు నమోదు చేయగా కొద్దిరోజుల పాటు జైలు జీవితం కూడా అనుభవించాడు. అయినా అతనిలో మార్పురాలేదు. మృతురాలి కుమారుడు నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రజినీకర్‌ తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా