భార్యను కడతేర్చిన భర్త

1 Sep, 2019 09:12 IST|Sakshi
ఘటనా స్థలంలో అశ్విని మృతదేహం, పక్కన శ్యాముల్‌(ఫైల్‌)

సాక్షి, రామవరప్పాడు(కృష్ణా): భార్యపై అనుమానంతో దారుణంగా హత్య చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పచ్చడి బండతో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరు రామానగర్‌లో ఘంటా శామ్యూల్, ఆశ్విని భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి తేజస్వి(8), రఘురామ్‌ (6) పిల్లలు ఉన్నారు. శామ్యూల్‌ లారీ డైవర్‌గా పని చేస్తున్నాడు. వీరు సంవత్సరం క్రితం పామర్రు నుంచి నిడమానూరు వచ్చి అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. లారీ డ్రైవర్‌ కావడంతో వారం, పది రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో గన్నవరానికి చెందిన ఓ యువకుడితో అశ్వినికి ఏర్పడ్డ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసి అశ్వినితో భర్త పలుమార్లు గొడవ పడ్డాడు. శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవ జరగడంతో శామ్యూల్‌ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.

తరువాత  రోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న శామ్యూల్‌ తలుపు కొట్టడంతో అశ్విని తలుపు తీసింది. భార్యపై కోపంతో ఉన్న భర్త వచ్చి రావడంతోనే ఇంటి ఆవరణలో ఉన్న పచ్చడి బండతో అశ్విని తలపై గట్టిగా కొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సమయంలో వీరి పిల్లలు నిద్రపోతున్నారు. సమాచారం అందుకున్న పటమట సీఐ ఎంవీ దుర్గారావు, సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిను గుర్తించేందుకు మృతురాలి కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన పచ్చడి బండను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేశారు. అశ్విని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన శామ్యూల్‌
హత్య చేసిన అనంతరం నేరుగా పటమట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి శామ్యూల్‌ లొంగిపోయాడు. అశ్విని వేరే వ్యక్తితో ఉన్న ఫొటోలను పోలీసులకు అందజేసినట్లు సమాచారం. అక్రమ సంబంధంపై పలుమార్లు హెచ్చరించిన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో హత్య చేశానని పోలీసుల వద్ద అంగీకరించినట్లు తెలిసింది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా