కట్టుకున్నోడే కాలయముడు

16 Dec, 2018 08:29 IST|Sakshi
సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ రవీందర్‌ 

వివాహిత హత్య కేసు మిస్టరీని     ఛేదించిన పోలీసులు

అదనపు కట్నం కోసమే ఘాతుకం

హత్యోదంతానికి సహకరించిన నిందితుడి తల్లిదండ్రులు, సోదరులు 

ఐదుగురు నిందితుల అరెస్ట్‌

సాక్షి, కనగల్‌ (నల్లగొండ) : వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అదనపు కట్నం కోసమే కట్టుకున్న భర్తే ఘాతుకానికి తెగబడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్యోదంతానికి సహకారం అందించిన ప్రధాన నిందితుడి తల్లిదండ్రితో పాటు ఇద్దరు సోదరులను కూడా అరెస్ట్‌ చేశారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రవీందర్‌ కేసు వివరాలు వెల్లడించారు.  

ప్రేమించి పెళ్లి చేసుకుని...
శేరిలింగోటం గ్రామానికి చెందిన కన్నెబోయిన సైదులు అదే గ్రామంలో ఉంటున్న కవిత(21)ను ఏడాది క్రితం మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు అన్నల పెళ్లిళ్లు కాకముందే సైదులు మొదట వివాహం చేసుకోవడం అప్పట్లో గ్రామంలో చర్చనీయాంశమైంది. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో రెండు కుటుం బాలు మిన్నకున్నాయి. 

వరకట్నం రాలేదని..
ఈ క్రమంలో సైదులు ఇద్దరు సోదరుల వివాహాలు అయ్యాయి. అయితే వారికి వరకట్నం రావడంతో సైదులుకు కట్నంపై ఆశ కలిగింది. కవితను పెళ్లి చేసుకోవడంతోనే తనకు కట్నం రాలేదనుకున్న సైదులు ఆరునెలల కాపురం తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న కవితను కట్నం కోసం చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. సైదులు చేస్తున్నది తప్పు అని చెప్పాల్సిన అతని తల్లిదండ్రులతోపాటు ఇద్దరు అన్నలు సహకరించారు. గ్రామంలోనే ఉంటున్న కవిత తల్లిదండ్రులు తరచు తమ కూతురిని కొట్టడంతో పలుమారు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఎన్నికల తర్వాత మట్లాడుదామని గ్రామపెద్దలు చెప్పడంతో కవిత పుట్టింటికీ వెళ్లిపోయింది. పంచాయితీలోనే పరుశ పదజాలంతో సైదులుతోపాటు కుటుంబ సభ్యులు దూషించారు. అప్పటి నుంచి కవిత అడ్డుతొలగించుకునేందుకు పథకం పన్నారు.

హత్యకు కలిసొచ్చిన మీటింగ్‌
హత్య జరిగిన రోజు జిల్లాకేంద్రంలో ఓ పార్టీ ఎన్నికల బహిరంగ సభ ఉండటంతో మెజార్టీ గ్రామస్తులు అక్కడకు వెళ్లారు. అదేరోజు కవిత తల్లిదండ్రులు అబ్బరబోయిన నాగయ్య, వెంకటమ్మలు తమ బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి వెళ్లారు. గ్రామంలో జనం పలుచగా ఉండటం, కవిత తల్లిదండ్రులు ఊర్లో లేకపోవడం, ఒంటరిగా ఉన్న కవితను హత్య చేసేందుకు ఇదే అదునుగా సైదులు భావించాడు. మధ్యాహ్న సమయంలో తల్లిదండ్రులు కౌలు చేస్తున్న పత్తిచేను వద్ద ఉన్న పశువులకు నీళ్లు తాపేందుకు  వెళుతుండగా మార్గమధ్యలో కవితను అటకాయించిన సైదులు నీతో మాట్లాడాలని చెప్పి ఆమె వెంట పత్తిచేను వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలు పెరిగి ఘర్షణ జరిగింది.

అప్పటికే అంతం చేయాలని భావించిన సైదులు కవిత ఛాతిపై పిడిగుద్దులు గుద్ది దారుణానికి ఒడిగట్టాడు. హత్య జరిగిన అనంతరం సైదులు రెండో అన్న పరమేశ్‌ కొద్ది దూరంలో బైక్‌పై ఉండగా అక్కడకు చే రుకుని అన్నదమ్ములిద్దరు అక్కడ నుంచి పారిపోయారు. అప్పటికే సైదులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరడంతో అదేరోజు పశువులు, జీవాలను తోలుకుని వెళ్లి శివన్నగూడెంలో విక్రయించారు. అప్పటి నుంచి అందరూ పరారీలో ఉన్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. సైదులు తోపాటు ఇద్దరు అన్నలు నరేశ్, పరమేశ్, తల్లిదండ్రులు అం జయ్య, శంకరమ్మలను రి మాండ్‌కు తరలించి నట్లు సీఐ తెలిపారు.  సమావేశంలో కనగల్‌ ఎస్సై ఎన్‌. శ్రీను, కాని స్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు