భార్యను లారీ కిందకు తోసి హత్య

10 Jul, 2019 11:25 IST|Sakshi

అనుమానంతో భర్త ఘాతుకం

హత్యకు సహకరించిన లారీ, ఆటో డ్రైవర్లు

పరారీలో నిందితులు

సాక్షి, ఝరాసంగం(జహీరాబాద్‌): భార్యపై అక్రమ సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్న  భర్త ఆమెను లారీ కిందకు తోసేసి హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మొగుడంపల్లి  మండలం మన్నాపూర్‌ గ్రామానికి చెందిన శంకర్‌కు నాగమణి(38)తో 10 సంవత్సరాల క్రితం పెళ్లయింది.

అయితే ఇటీవలి కాలంలో గ్రామంలోనే ఇతర వ్యక్తితో భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యను వదిలించుకుందామని అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్‌తో కలిసి పథకం వేశాడు. పథకం ప్రకారం భార్యను వదిలించుకునేందుకు సోమవారం రాత్రి ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయానికి దర్శనానికి ఆటోలో డ్రైవర్‌ హకీంతో కలిసి వచ్చారు.

అనుకున్న  ప్రకారం తిరుగు ప్రయాణంలో కుప్పానగర్‌ గ్రామ శివారులోకి రాగానే ఆటో పంక్చర్‌ అయ్యిందని పక్కకు తోయాలని చెప్పడంతో నాగమణి ఆటో దిగింది. ఆటోను తోస్తున్న క్రమంలో లారీ డ్రైవర్‌ ఝరాసంగం నుండి జహీరాబాద్‌ వైపు లారీని తీసుకువస్తున్నాడు. పథకం ప్రకారం వస్తున్న లారీ కిందికి శంకర్‌ నాగమణిని  తోసేశాడు. లారీ చక్రాలు ఆమె తలపై నుండి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని వివరాలు సేకరించారు. ముందు రోడ్డు ప్రమాదంలో మరణించిందని నమ్మించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అసలు విషయాన్ని వెలికి తీశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు వివరించారు. మృతురాలి తండ్రి శరణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పాలవెల్లి, ఎస్‌ఐ ఏడుకొండలు వివరించారు. 

మరిన్ని వార్తలు