హత్యా..? ఆత్మహత్యా?

12 Jul, 2019 09:10 IST|Sakshi
సంఘటనా స్థలంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీంలతో ఆధారాల సేకరణ 

అనుమానాస్పద స్థితిలో తల్లీకొడుకుల మృతి 

పోలీసుల అదుపులో భర్త 

విచారణ చేపడుతున్న పోలీసులు 

సాక్షి, మనూరు(నారాయణఖేడ్‌): అనుమానస్పద స్థితిలో తల్లి కొడుకు మృతిచెందిన సంఘటన నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. కరస్‌గుత్తి గ్రామానికి చెందిన చింతాకి వెంకట్‌రెడ్డి భార్య కవిత(28), నాలుగేళ్ల కుమారుడు అయిన దినేష్‌రెడ్డితో కలిసి బుధవారం మధ్యాహ్నం సమయంలో కిరోసితో నిప్పు అంటించుకొని చనిపోయింది. భార్యను కుమారుడిని భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం బుధవారం  సాయంత్రం వెలుగులోకి వచ్చింది.  

తొమ్మిదేళ్లు హైదరాబాద్‌లో నివాసం.. 
ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఔరాద్‌ తాలుక పరిధిలోని బిజల్‌వాడి గ్రామానికి చెందిన తిప్పారెడ్డి, ఉక్కమ్మ దంపతుల కుమార్తె కవిత. ఈమెకు 2009లో నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డితో వివాహం జరిగింది. వివాహం అనంతరం బతుకుదెరువు కోసం తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉన్నారు. ఏడాది క్రితం స్వగ్రామం కరస్‌గుత్తికి వచ్చారు.  

ఆస్తి భార్యపేరు మీదకి రావడంతో గొడవలు.. 
గ్రామంలో వెంకట్‌రెడ్డికి ఉన్న ఎనిమిది ఎకరాల భూమిలో కొంత భాగం అమ్మాడు. వచ్చిన డబ్బులతో ‘తుఫాన్‌’ వాహనం కొనుగోలు చేసిన వెంకట్‌రెడ్డి, తానే స్వయంగా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.  మరికొంత భూమిని సైతం అమ్మడానికి ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు నాలుగు ఎకరాల మేర  భూమిని వెంకట్‌రెడ్డి భార్య కవిత పేరుమీదకు మార్చారు. దీంతో అప్పటి నుంచి పలుమార్లు గొడవలు పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. 

గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు 
అనుమానాస్పద మృతి సంఘటనపై గ్రామంలో తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృతిరాలితోపాటు నాలుగేళ్ల బాలుడు సైతం మృత్యువాత పడటాని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే గ్రామంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం మూడో సారి కావడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది.   

భర్తను అదుపులోకి తీసుకున్నాం: సీఐ 
హత్యకు సంబంధించి తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతురాలి భర్త చింతాకి వెంకట్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామన్నారు. ఆయన వెంట స్థానిక ఎస్‌ఐ శేఖర్, పోలీసు సిబ్బంది ఉన్నారు. 

మృతిపై పలు అనుమానాలు 
మృతి సంఘటనపై స్థానికులతోపాటు మృతురాలి కుటుంబ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. మృతి చెందిన సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. హత్య చేసిన అనంతరం ఒంటిపై కిరోసిన్‌ పోసి దగ్ధం చేశారని అభిప్రాయపడ్డారు. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడితే ఇళ్లంతా పలు ఆనవాళ్లు కనిపించేవని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. పక్కనే ఉన్న బట్టలు సైతం కాలిపోకుండా ఉండటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. కిరోసిన్‌ కాకుండా పెట్రోల్‌ వాడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. 

క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో విచారణ 
సంఘటనపై పలు అనుమానాలు బలపడటంతో నారాయణఖేడ్‌ సీఐ వెంకటేశ్వర్‌రావు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి విచారణ చేయించారు. ఇందుకు సంబంధించిన పలు వస్తువులను సైతం సేకరించారు. కాగా తనిఖీకి వచ్చి డాగ్‌ ఇంట్లో తిరుగుతూ ఎదురుగా ఉన్న ఓ ఇంటివద్ద నుంచి నేరుగా కరస్‌గుత్తి పీడబ్ల్యూడీ రోడ్డుకు వెళ్లి కూర్చుంది.   

మరిన్ని వార్తలు