పొలంలో మృతదేహం.. 40 రోజుల తర్వాత..

30 Jun, 2020 10:54 IST|Sakshi
రోదిస్తున్న వీణమ్మ తండ్రి, చెల్లి, బంధువులు(ఇన్‌సెట్‌లో) నిందితుడు నెరణికి బసవరాజు

గర్భిణిని కడతేర్చిన భర్త 

గొంతునులిమి హత్య 

మృతదేహాన్ని పొలంలో పూడ్చిన వైనం 

40 రోజుల తర్వాత వెలుగులోకి.. 

హొళగుంద మండలం 

ముగుమానుగుందిలో ఘటన 

హొళగుంద (కర్నూలు): కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. అనుమానంతో భార్యను దాదాపు ఎనిమిదేళ్ల పాటు చిత్రహింసలు పెట్టాడు. చివరకు కడతేర్చి మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టాడు. 40 రోజుల తర్వాత విషయం వెలుగు చూసింది.  హొళగుంద మండలం ముగుమానుగుంది గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, హతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి.  ముగుమానుగుంది గ్రామానికి చెందిన నెరణికి గిరిమల్లప్ప, రత్నమ్మ కుమారుడైన బసవరాజుకు తొమ్మిదేళ్ల క్రితం ఆస్పరి మండలం కైరుప్పల గ్రామానికి చెందిన భీమప్ప, ఈశ్వరమ్మ రెండో కుమార్తె వీణమ్మ(28) అలియాస్‌ మీనాక్షిని ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో ఐదు తులాల బంగారం, రూ.50 వేల నగదు కట్నంగా ఇచ్చారు.

వీరికి ఐదేళ్ల కుమారుడు శశికుమార్‌ ఉన్నాడు.  పెళ్లయిన ఏడాది వరకు బాగానే ఉన్న బసవరాజు ఆ తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తల్లిదండ్రులతో పాటు చెల్లెళ్లు మంజుల, అన్నపూర్ణతో కలిసి ఆమెను నిత్యం చిత్రహింసలు పెట్టేవాడు. ఆఖరుకు ఆమెను పాత ఇంట్లో ఉంచి.. తాను, తల్లిదండ్రులు కొత్త ఇంట్లో ఉండేవారు. బసవరాజు తనకు అవసరమైనప్పుడు మాత్రమే భార్య దగ్గరకు వెళ్లి వచ్చేవాడు. పలుమార్లు అబార్షన్‌ కూడా చేయించినా భరిస్తూ వచ్చింది. తుదకు ఈ ఏడాది మే 19న పొలంలో ఆమె గొంతునులిమి హత్య చేసి అక్కడే పాతిపెట్టారు. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణి. తర్వాత కొద్ది రోజులకు తన భార్య కనిపించడం లేదంటూ మామ భీమప్పకు బసవరాజు సమాచారం ఇచ్చాడు.

వారు అన్ని చోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు. చివరకు భర్త, అత్తమామలపై అనుమానం ఉందంటూ ఈ నెల 16న హొళగుంద పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ విజయకుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది. సోమవారం ఆదోని ట్రైనీ డీఎస్పీ మెహర్‌ జయరాం ప్రసాద్, ఆలూరు సీఐ భాస్కర్, హొళగుంద, చిప్పగిరి ఎస్‌ఐలు విజయకుమార్, జాకీర్‌ తమ సిబ్బందితో కలిసి వచ్చి పొలంలో పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీయించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.  హతురాలి తండ్రి భీమప్ప   ఫిర్యాదు మేరకు భర్త నెరణికి బసవరాజు, అత్తమామలు రత్నమ్మ, గిరిమల్లప్పతో పాటు బసవరాజు చెల్లెళ్లు మంజుల, అన్నపూర్ణపై కేసు నమోదు చేసినట్లు ఆలూరు సీఐ భాస్కర్, హొళగుంద ఎస్‌ఐ విజయకుమార్‌ తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు